ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్ బాధ్యతలు
ములుగు: జిల్లా ఎస్పీగా శనివారం సుధీర్ రాంనాథ్ కేకన్ బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేసిన ఆయన ములుగు ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్పీగా పనిచేసిన డాక్టర్ శబరీశ్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. గతంలో ములుగు ఏఎస్పీగా పనిచేసిన సుధీర్ రాంనాథ్ కేకన్‌కు మేడారం జాతరపై అవగాహన, అనుభవం ఉంది. మరో రెండు నెలల్లో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఎస్పీ పర్యవేక్షణలో జరగనుంది.
విద్యుత్‌శాఖ సర్కిల్ ఎస్‌ఈగా ఆనందం
ములుగు రూరల్: ములుగు విద్యుత్‌శాఖ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా ఆనందం శనివారం బాధ్యతలను స్వీకరించారు. సర్కిల్ పరిధిలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఇంతకాలం ములుగు సర్కిల్‌కు సూపరింటెండెంట్ ఇంజనీర్ లేకపోవటంతో ప్రతీ విషయానికి భూపాలపల్లి జిల్లాకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లేబర్ కోడ్‌లతో కార్మికుల కుటుంబాలు చీకటిపాలు
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్‌లను అమలుతో కార్మికుల కుటుంబాలు చీకటి పాలు అవుతాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లేబర్ కోడ్‌లను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల కనీస సౌకర్యాలు, హక్కులను అధికారికంగా కాలరాయడమేనని వెల్లడించారు.
ప్రజా చైతన్యానికి కళాకారుల కృషి
గోవిందరావుపేట: ప్రజా చైతన్యానికి కళాకారులు నిరంతరం కృషి చేయాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ అన్నారు. మండల పరిధిలోని పస్రా సీపీఎం కార్యాలయంలో శనివారం ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ములుగు డివిజన్ స్థాయి శిక్షణ తరగతులు గుగ్గిళ్ల దేవయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళ కాసుల కోసం కాకుండా ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలన్నారు. అనేక ఉద్యమాలు కళాకారుల ద్వారానే ఉద్బవించాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కళ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కళాకారులు తమ కళారూపాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్క సైదులు, పొదిల్ల చిట్టిబాబు, అంబాల మురళి, ప్రవీణ్, నాగరాజు, కవిత, సువర్ణ, రాజు, రామకృష్ణ, చిరంజీవి, కృష్ణబాబు, ఐలయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
భక్తుల రద్దీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శని, కాలసర్ప నివారణ పూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి ఆలయంలో శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్బగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి కనిపించింది.
ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్ బాధ్యతలు


