మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
ములుగు/గోవిందరావుపేట/ఎస్‌ఎస్ తాడ్వాయి: రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట మండలాల్లో కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి సీతక్క మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలు, బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మహిళా ఉన్నతికి, మహిళలు వ్యాపార రంగంలో రాణించడానికి వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మహిళలు లేనిదే సృష్టి లేదని, మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు వెలుస్తారని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారిని గౌరవించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ ఫలాలను ప్రవేశ పెడుతున్నారని వివరించారు. మహిళా సంఘాల గ్రూపులోని ప్రతి మహిళను గుర్తించడానికి ప్రత్యేక చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇంటింటికి ఇందిరమ్మ చీరలు అందుతాయన్నారు. మాజీ ప్రధాని ఇందిరమ్మ ఉక్కు సంకల్పం ప్రతీ మహిళలో ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం మార్చి 8వ తేదీలోపు ప్రతీ మహిళకు చీరలను అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
చెక్కుల పంపిణీ
ములుగు మండలంలోని 370 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.46.50 కోట్ల రుణాల చెక్కులను, 38 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం వెంకటాపురం (ఎం) మండలంలోని 195 మహిళా సంఘాలకు రూ. 26.50 కోట్ల రుణాల చెక్కులను, 43 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందించారు. గోవిందరావుపేట మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 283 సంఘాలకు రూ. 29.86కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని 120 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.8 కోట్ల చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి, డీఆర్‌డీఓ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ ఇందిరమ్మ చీర అందిస్తాం
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం


