డీసీసీ అధ్యక్షుడిగా అశోక్
● రెండోసారి ఎంపిక చేసిన ఏఐసీసీ
ములుగు: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పైడాకుల అశోక్‌ను రెండోసారి నియమిస్తూ ఏఐసీసీ శనివారం జాబితా విడుదల చేసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గత నెల 14న ఏఐసీసీ పరిశీలకులు జాన్సన్ అబ్రహం, సాగరికరావు, నాగేందర్‌రెడ్డిలు నామినేషన్లు స్వీకరించగా జిల్లా నుంచి ఆరుగురు నామినేషన్లను దాఖలు చేశారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలం నుంచి ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు మండలం నుంచి గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, వెంకటాపురం(ఎం) మండలం నుంచి మల్లాడి రాంరెడ్డి, గోవిందరావుపేట నుంచి సూరపనేని నాగేశ్వర్‌రావు, ఏటూరునాగారం నుంచి ఇర్సవడ్ల వెంకన్న, వెంకటాపురం(కె) నుంచి చీడం రామ్మోహన్‌రావు పోటీపడ్డారు. జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పాటు వివిధ మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షుల నుంచి ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. ఈ మేరకు పైడాకుల అశోక్‌కు డీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం కల్పిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది.


