● కొండాయి వద్ద వాహనాలు వెళ్లేదెలా?
● డైవర్షన్ రోడ్డు లేక భక్తుల ఇబ్బందులు
● టెండర్లు పూర్తయినా..
అగ్రిమెంట్ కాని పరిస్థితి
ఏటూరునాగారం: ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, షాపెల్లి, కొండాయి మీదుగా ఊరట్టం నుంచి మేడారం జాతరకు చేరుకుంటారు. అయితే మండలంలోని కొండాయి వద్ద హైలెవల్ బ్రిడ్జి కూలిపోగా డైవర్షన్ తాత్కాలిక రోడ్డును మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీశాఖ ద్వారా రూ.50 లక్షలు మంజూరు చేసింది. వీటికి ఇంజనీరింగ్‌శాఖ టెండర్లు పూర్తికాగా అగ్రిమెంట్ ఇంత వరకు చేయలేదు. దీంతో కొండాయి జంపన్నవాగు వద్ద తాత్కాలిక రోడ్డు పనులు మొదలు కాలేదు. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మహా జాతర దగ్గర పడుతున్నప్పటికీ పనులు మొదలు కాకపోవడంతో అప్పటి వరకు పూర్తి అవుతాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
110 మీటర్ల పొడవుతో మట్టిరోడ్లు
జంపన్నవాగు బ్రిడ్జికి ఇరువైపుల 110 మీటర్ల పొడువుతో మట్టి రోడ్డును నిర్మించాల్సి ఉంది. వాగులో సిమెంట్ పైపులు అమర్చి ఇసుక బస్తాలు, మొరంతో వాహనాలు వెళ్లే విధంగా చేయాల్సి ఉంది. అయితే ఈ రోడ్డు పూర్తి కాకపోతే మేడారం జాతరకు వచ్చే భక్తుల వాహనాలు వాగు దాటే పరిస్థితి ఉండదు. గతంలో 2024లో రూ.27 లక్షలతో నిర్మించిన రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. ఇప్పుడు కేవలం వాగు నీటిలో నుంచి రాకపోకలను సాగిస్తున్నారు. గ్రామం వైపు ఉన్న వారు వాహనాలు అటువైపు నిలుపుకొని కాలినడకన దాటి ఆటోలు, బైక్‌లతో మండల కేంద్రానికి రాకపోకలను సాగిస్తున్నారు. విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ రోడ్డు నిర్మిస్తేగానీ ప్రజలు, భక్తుల ఇబ్బందులు తొలగవని స్థానికులు వాపోతున్నారు.
గోతులమయంగా కొండాయి రోడ్డు
ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు ఉన్న 14 కిలోమీటర్ల రోడ్డు గోతుల మయంగా మారింది. 2022లో రూ.6 కోట్లు మంజూరు కాగా కాంట్రాక్టర్ పనులు చేయకుండానే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో షాపెల్లి వద్ద కల్వర్టు అసంపూర్తిగా అటు ఇటు కేవలం కాంక్రీట్ వాల్ నిర్మించి పైన స్లాబ్ వేయలేదు. దీంతో గ్రామస్తులు కల్వర్టు పక్క నుంచి మట్టిరోడ్డు నిర్మించి వాహనాల రాకపోకలను సాగిస్తున్నారు. కల్వర్టుతోపాటు షాపెల్లి, దొడ్ల కొత్తూరు సమీపంలో రోడ్డు ధ్వంసమై కంకరతేలి అధ్వానంగా మారింది. జాతర సందర్భంగా పంచాయతీరాజ్ ద్వారా రూ.35 లక్షలు కేటాయించగా ఇప్పటి వరకు తట్ట పని కూడా మొదలు పెట్టలేదు. జాతర సమీపిస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రోడ్డు నిర్మించాలి
చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల, కొండాయి వరకు శాశ్వత బీటీ రోడ్డు నిర్మించాలి. అసంపూర్తిగా ఉన్న కల్వర్టులు పునరుద్ధరించి ఇబ్బందులు లేకుండా చూడాలి. రోడ్డు సరిగా లేక బస్సులు వచ్చే పరిస్థితిలేదు. ప్రయాణికులు, గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
– మాదరి రాంబాబు, షాపెల్లి, ఏటూరునాగారం
త్వరలో నిర్మాణ పనులు చేపడతాం..
డైవర్షన్ రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు పూర్తి చేశాం. ఇంకా అగ్రిమెంట్ కాలేదు. మరో వారం రోజుల్లో పనులు చేపడతాం.
–వెంకటేశ్, ఏఈ
వాగు దాటితేనే జాతర!
వాగు దాటితేనే జాతర!


