పథకాలను ప్రజలకు సకాలంలో అందించాలి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో అందించాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకరతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ది సాధించాలన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది పనుల నివేదికలను అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాబట్టుకుని జిల్లాను ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలని వివరించారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు, గోదాంల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం, జంగాలపల్లి టు పస్రా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణం, జలగలంచ, కృష్ణాపురం, టేకులగూడెం బ్రిడ్జిల నిర్మాణాల ప్రతిపాదనలు, ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లాను నాల్గో స్థానంలో నిలిపినందుకు అధికారులను అభినందించారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో నూతన అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్ పూర్ణచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీఎస్పీ రవీందర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్


