ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలి
ములుగు రూరల్: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన బస్సుజాతా ములుగు జిల్లా కేంద్రానికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా డీఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్ నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి విచారణ చేపట్టాలన్నారు. మావోయిస్టులను టెర్రరిస్టుల మాదిరిగా కేంద్రం భావించడం సరికాదన్నారు. కేంద్రంలో బీజేపీ నరహంతక పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన సభకు కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్, జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, ఎండి అమ్జద్‌పాషా, ముత్యాల రాజు, బండి నర్సయ్య, సారయ్య, శ్రీనివాస్, రమేష్, తిరుపతి, రమా, ప్రమీల, రాజకుమారి, కమలక్క, లింగమూర్తి, రాధ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు


