కళ్ల ముందే దందా..
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్‌లో గుట్కా దందా రూట్ మార్చింది. గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు, అరెస్టుల పరంపరకు పలువురు పంథా మార్చారు. ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు. గ్రేటర్ వరంగల్ పరిసర మండలాలు, గ్రామాలకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి వరంగల్‌కు వలస వచ్చిన కొందరు, గుట్కా దందాలో ఆరితేరిన స్థానిక వ్యాపారులతో కలిసి మళ్లీ దందాను సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో వారికి సహకరించిన వివిధ రాజకీయ పార్టీల నేతల అండదండలతో చాపకింద నీరులా వ్యాపారాన్ని విస్తరించినట్లు ఇటీవల నమోదైన కేసులు, పోలీసులకు లభ్యమైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
బీదర్ టు వరంగల్ వయా హైదరాబాద్..
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌నుంచి హైదరాబాద్ ద్వారా వరంగల్‌కు ఈ గుట్కా చేరుతోంది. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ఓ మార్వాడి వ్యాపారి వరంగల్‌లోని కొందరికి సరఫరా చేస్తున్నారు. ఇక్కడినుంచే ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చేరవేస్తున్నట్లు గతంలో పోలీసులకు చిక్కిన వారు విచారణలో చెప్పడం గమనార్హం. వరంగల్, హనుమకొండలలోని శివనగర్, పిన్నవారి స్ట్రీట్, టైలర్ స్ట్రీట్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు ఈ దందాలో భాగస్వాములైనట్లు పోలీసు రికార్డుల్లో ఉంది. వరంగల్‌కు చెందిన అంబర్ డిస్ట్రిబ్యూటర్‌లు, ధర్మారానికి చెందిన కొందరిపై ఫిర్యాదులున్నాయి. వరంగల్‌కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఆటోల ద్వారా గ్రేటర్ వరంగల్ చుట్టున్న కొన్ని మండలాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అంబర్, అనార్, మిరాజ్, ఆర్‌ఆర్ పాన్ మసాలల పేరిట నిషేధిత గుట్కాలకు సరఫరా చేస్తూ.. పోలీసులకు చిక్కి కోర్టుకు వెళ్లాల్సి వస్తే పాన్ మసాలాల పేర్లు చెప్పి బయట పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు వ్యాపారులే గుట్కా దందా చేయగా.. తాజాగా వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులే సూత్రధారులుగా మారి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్క లారీ సరుకుపై
రూ.60–రూ.75 లక్షల ఆదాయం..
మాణిక్‌చంద్, సితార్, సాగర్, గోవా, రెబల్, సిమ్లా, గోవా, అంబర్ .. తదితర బ్రాండ్లకు చెందిన నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కంపెనీనుంచి హోల్‌సేల్ వ్యాపారికి.. అక్కడినుంచి రిటైల్‌గా షాపులకు సరఫరా చేసేందుకు ప్రతి జిల్లాలో ‘గుట్కా మాఫియా’పెద్ద నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకుంది. ఒక్క గుట్కా లారీ (డీసీఎం వ్యాన్) నేరుగా వ్యాపారి వద్దకు వస్తే రూ.60 లక్షల సంపాదన వచ్చినట్లే. ఒక లారీలో 250 కాటన్ల గుట్కా వస్తుంది. ఒక్కో కాటన్లో 70 పొడలు, ఒక్కో పొడలో 50 ప్యాకెట్లు ఉంటాయి. 50 పొట్లాలు ఉండే ఒక్క పొడ (బాక్స్) రూ.350లకు ఇస్తుండగా... రిటైల్ వ్యాపారులు ‘నిర్భంధం, నిషేధం, పోలీసు నిఘా’తదితర పదా లు వాడుతూ రూ.750ల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఒక్క గుట్కా ప్యాకెట్‌ను రూ.7కు తీసుకుని రూ.15ల నుంచి 18లు, ఆపై రేట్లకే అమ్ముతున్నారంటే లాభాలు ఏ మేరకు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. హోల్‌సేల్ వ్యాపారులు ఇవే గుట్కాలను కంపెనీని బట్టి రూ.20 నుంచి రూ.25ల వరకు.. పాన్‌టేలా, కిరాణం దుకాణం దారులు రూ.30ల నుంచి రూ.40లు అమ్ముతున్నారు. గుట్కా విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తూ దాడులు చేస్తూ కేసులు పెడుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయినా ఆగకపోవడంతో పోలీసులు ఇంకా కఠినంగా వ్యవహరించాలని, ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.
యథేచ్ఛగా వ్యాపారం..
రూ.లక్షల్లో పట్టుబడుతున్న గుట్కా
కర్ణాటక నుంచి హైదరాబాద్ ద్వారా వరంగల్‌కు..
నిల్వ కేంద్రాలుగా ‘గ్రేటర్’ పరిసరాలు.. ఇక్కడినుంచే పొరుగు జిల్లాలకు
పోలీసులకు కీలక సమాచారం?.. వ్యాపారులకు రాజకీయ మద్దతు


