ములుకనపల్లిలో పోస్టాఫీస్ ప్రారంభం
వాజేడు: మండల పరిధిలోని మారుమూల గ్రామమైన ములుకనపల్లిలో బుధవారం పోస్టాఫీసును ప్రారంభించారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రావు రిబ్బన్ కత్తిరించి పోస్టల్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసు ద్వారా అందుబటులో ఉన్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
రంగోలి పోటీలు
ములుగు రూరల్: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు విద్యార్థినులకు రంగోలి పోటీలను నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఇంటర్మీడియట్ విద్యార్థినులు, మహిళా పాఠకులు రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు గ్రంథాలయ సిబ్బంది బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అలివేలు, సీనియర్ అసిస్టెంట్ నిఖిల్, గ్రంథాలయ పాలకురాలు సమ్మక్క, కళాశాల అధ్యాపకుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.
ముసుగులు తీసేదెప్పుడో?
ఏటూరునాగారం: గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని గ్రామ పంచాయతీ అధికారులు హడావుడిగా ఎన్నికల కోడ్ ఉందని రాజకీయ నాయకుల విగ్రహాలు, శిలాఫలకాలకు ముసుగులు వేశారు. కానీ అనివార్య కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్‌ను సడలించారు. అయినప్పటికీ స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది మాత్రం శిలాఫలకాలకు వేసిన ముసుగులను మాత్రం తీయకుండా నిర్లక్ష్యంగానే వదిలేశారు. స్వయంగా మంత్రి సీతక్క ప్రారంభించిన శిలాఫలకాలకు వేసిన ముసుగులను అలాగే వదిలేయడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా మారింది.
హేమాచలుడికి శాంతి కల్యాణం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు ఆలయ పూజారి ముక్కామల శేఖర్‌శర్మ ఆధ్వర్యంలో బుధవారం శాంతికల్యాణం(మాస కల్యాణం) జరిపించారు. యాగశాలలో స్వామివారి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న భక్తులు శాంతి కల్యాణంలో పాల్గొన్నారు. అదే విధంగా లక్ష్మీనర్సింహస్వామిని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బుధవారం దర్శించుకున్నారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పూజారులు శేఖర్‌శర్మ, రాజీవ్ నాగఫణిశర్మ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆయన గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. ఆనంతం స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేష వస్త్రాలను అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
బాల్యవివాహాలపై కళాజాతా
కాళేశ్వరం: మహదేవపూర్, అంబట్‌పల్లి, సూరారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో కలెక్టర్, డీపీఆర్‌ఓల ఆదేశాల మేరకు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి సెగ్గం శిరీష కళా బృందం అవగాహన కల్పించారు. బాల్యవివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు.
ములుకనపల్లిలో పోస్టాఫీస్ ప్రారంభం
ములుకనపల్లిలో పోస్టాఫీస్ ప్రారంభం
ములుకనపల్లిలో పోస్టాఫీస్ ప్రారంభం


