క్రీడలతో మానసికోల్లాసం
సొమ్మసిల్లి పడిపోయిన క్రీడాకారులు
ఏటూరునాగారం: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని కొమురం భీమ్ మినీ స్టేడియంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు జోనల్ స్థాయి క్రీడాపోటీలను ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో చురుకుదనం పెరుగుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుంచి దాదాపు 1600 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను డిసెంబర్‌లో నిర్వహించనున్న రాష్ట్రా స్థాయి క్రీడాపోటీలకు పంపనున్నట్లు వివరించారు. బాల బాలికలకు వేర్వేరుగా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో ఏటూరునాగారంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ఏటూరునాగారం ఐటీడీఏ ప్రథమ బహుమతి గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఈఈ వీరభద్రం, డిప్యూటీ డైరెక్టర్ జనార్ధన్, ఏఓ రాజ్‌కుమార్, హనుమకొండ డిప్యూటీ డైరెక్టర్ హేమలత, ఏసీఎంఓ రవీందర్, జీసీడీఓ సుగుణ, స్పోర్ట్స్ అధికారులు సుమలత, ఆదినారాయణ, కృష్ణ, నారాయణ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
జోనల్‌స్థాయి క్రీడాపోటీలను
ప్రారంభించిన పీఓ
ఐటీడీఏ అధికారులు దూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు కనీస ఏర్పాట్లను చేయకపోవడంతో ఇద్దరు క్రీడాకారులు జమున, రేణుక సొమ్మసిల్లి పడిపోయారు. క్రీడా అధికారులు విద్యార్థులను గంటల తరబడి ఎండలో నిలబెట్టడంతో పడిపోయారు. వారికి అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందితో చికిత్సలు చేయించి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలతో మానసికోల్లాసం


