వయోవృద్ధుల హక్కులను గౌరవించాలి
ఏరియా ఆస్పత్రి నుంచి చేపట్టిన ర్యాలీ
సదస్సులో మాట్లాడుతున్న మహేందర్
ములుగు రూరల్: వయోవృద్ధుల హక్కులను ప్రతిఒక్కరూ గౌరవించాలని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బుధవారం ఏరియా ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఆశయాలు, మా శ్రేయస్సు, మా హక్కులు అనే థీమ్‌తో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధులు దేశానికి వెలకట్టలేని సంపద అన్నారు. మన భవిష్యత్‌కు బలమైన పునాదని వివరించారు. ప్రస్తుత సమాజంలో వయో వృద్ధులను పట్టిచుకోవడం లేదన్నారు. వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని సీనియర్ సిటిజన్ యాక్టు ద్వారా వారి హక్కులను కాపాడవచ్చని వివరించారు. వయోవృద్ధుల పట్ల వేదింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వయోవృద్ధుల సంక్షేమ ఫోరం అధ్యక్షుడు రాంమూర్తి మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రక్షణ చట్టం, పోషణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రీడా, కవితా పోటీలు, వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ ఓంకార్, వయోవృద్ధుల శాఖ ఇన్‌చార్జ్ నాగేంద్ర, ఎఫ్‌ఆర్‌ఓ గణేశ్, డీసీపీయూ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
వృద్ధుల సంరక్షణ ప్రతీపౌరుడి బాధ్యత
వెంకటాపురం(ఎం): వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణ ప్రతీ పౌరుడి బాధ్యతని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ తెలిపారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకొచ్చిన వృద్ధుల భరణ పోషణ చట్టం 2007 గురించి వివరించారు. కుటుంబ సభ్యుల నుంచి తల్లిదండ్రులకు రక్షణ కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమన్నారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోతు స్వామిదాస్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమాధికారి తుల రవి
వయోవృద్ధుల హక్కులను గౌరవించాలి


