అక్రమ పట్టాను రద్దు చేయాలి
ములుగు రూరల్: గోవిందరావుపేట మండలం పస్రా నాగారం శివారులో 40 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టాను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 109/ఏ/ఈ లో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని పుల్యాల వసంత పేరున అక్రమ పట్టా పొందారని ఆరోపించారు. భూమిలో 30 ఎకరాల్లో చిన్న, సన్నకారు రైతులు సాగులో ఉన్నారని తెలిపారు. మిగతా 10 ఎకరాల భూమిలో 570 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని వెల్లడించారు. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా చేశారని వివరించారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారని తెలిపారు. ప్రభుత్వ భూమిని పట్టా చేయించుకున్న వసంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గుడిసె వాసులకు వెంటనే పట్టాలు అందించాలని కోరారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమ మల్లారెడ్డి, చిట్టిబాబు, ఆగిరెడ్డి, రాజేశ్, ప్రవీణ్, రవీందర్, నాగరాజు, సువర్ణ, అశోక్, సరళ, సులోచన, బ్రహ్మచారి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట సీపీఎం
ఆధ్వర్యంలో ధర్నా


