చీరలు సకాలంలో పంపిణీ చేయాలి
ములుగు రూరల్: మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ సకాలంలో చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి రామక్రిష్ణారావులతో కలిసి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఆర్‌డీఓ శ్రీనివాస్, మహిళా సమాఖ్య సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేయాలన్నారు. మహిళలకు పండుగ వాతావరణంలో చీరలను అందించాలని సూచించారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. మహిళా సమాఖ్య సభ్యులకు చీరలను అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని మండలాలకు చీరలను అందిస్తామని వివరించారు.
వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి


