డ్రెయినేజీ పనులు.. నిబంధనలు నిల్
వైబ్రేషన్ మిషన్ లేకుండానే కర్రతో కంకర కుదింపు
ములుగు: మేడారం సమీపంలోని రెడ్డిగూడెంలో నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్ నిబంధనలు పాటించడం లేదు. నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే తూతూ మంత్రంగా పనులు కానిచ్చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెడ్డిగూడెంలో పీఆర్‌శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణ పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
కర్రతో కంకర కుదింపు
డ్రెయినేజీ నిర్మాణం పనుల్లో సైడ్‌వాల్ నిర్మాణం కోసం సెంట్రింగ్ రేకులు కట్టి ఐజాక్స్ మిషన్‌తో కంకర, ఇసుక, సిమెంట్ కలిపి పోస్తున్నారు. ఈ క్రమంలో సైడ్‌వాల్ బలంగా ఉండేలా కంకరను వైబ్రేషన్ మిషన్‌తో కుదించాల్సిన ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ కర్రతో కంకరను కుదిస్తూ పనులు చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా సిమెంట్, కంకర, ఇసుక సమాన స్థాయిలో మిక్సింగ్ చేయాల్సి ఉండగా ఇసుక ఎక్కువగా పోసి సిమెంట్ తక్కువగా కులుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పది కాలల పాటు డ్రెయినేజీలు నిలిచేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా డ్రెయినేజీల నిర్మాణంలో చెట్టు, కరెంట్ స్తంభాలు అడ్డుగా వచ్చినా వాటి మధ్యలో నుంచే డ్రెయినేజీలు నిర్మిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, పనులను పర్యవేక్షించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
మంత్రుల ఆదేశాలు పట్టించుకోని కాంట్రాక్టర్
మేడారం జాతర అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడేది లేదని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్కలు కాంట్రాక్టర్లను అదేశించినా వారి అదేశాలను బేఖాతర్ చేస్తూ ఇష్టారితీన పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రెయినేజీల నిర్మాణాల్లో అడ్డుగా వస్తున్న విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి ఉండగా వాటిని తొలగించకుండానే నిర్మాణాలు చేపడుతు న్న అధికారులు పట్టింపులేనట్లుగా వ్యహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పనులు నిబంధనల ప్రకారం చేపట్టేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు
మంత్రుల ఆదేశాలు బేఖాతర్
డ్రెయినేజీ పనులు.. నిబంధనలు నిల్


