వైభవంగా శివపార్వతుల కల్యాణం
మంగపేట: మండల కేంద్రంలోని శ్రీ ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం మాస శివరాత్రి సందర్భంగా అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ కమిటీ చైర్మన్ కోలగట్ల నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ పూజారి విస్సావజ్జుల నరేశ్ శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. దేవతామూర్తుల కల్యాణ మహోత్సవానికి మంగపేట, బోరునర్సాపురం, కమలాపురం, చెరుపల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా శివపార్వతుల కల్యాణం


