వాహనదారులు అప్రమత్తం
ములుగు: ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో రోడ్లు సరిగా కనపడడం లేదని.. డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడిపి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్పీ తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. పొగమంచు కురిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు, రాత్రి 10 గంటల తర్వాత అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలన్నారు. లేకుంటే ప్రయాణాలను మానుకోవాలన్నారు. ముందు వెళ్తున్న వాహనానికి సాధారణం కంటే మూడురేట్లు ఎక్కువ దూరంగా ఉండాలన్నారు. వేగంగా వెళ్తూ ఆకస్మికంగా బ్రేకులు వేయకూడదన్నారు. రోడ్డు మార్కింగ్ లైన్ కనిపించకపోతే రహదారి అంచులను అనుసరిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. అలాగే నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. పాదాచారులు రాత్రి సమయంలో నల్లటి బట్టలు దరించడం మానుకోవాలన్నారు. బైక్‌లపై రిఫ్లెక్టివ్ జాకెట్లు, హెల్మెట్ పై రిఫ్లెక్టివ్ స్టికర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక నైట్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రహదారిపై మరమ్మతులకు గురైన వాహనాలను వెంటనే తొలగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పోలీసులు చేపడుతున్న చర్యలతో పాటు ప్రతీ వ్యక్తి బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
పొగమంచుతో కనిపించని రహదారులు
ప్రమాదాలు జరగకుండా
డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలి
ఎస్పీ డాక్టర్ శబరీశ్


