పేదింటి బిడ్డ.. సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగం
ఏటూరునాగారం: దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఓ పేదింటి బిడ్డ సీఐఎస్‌ఎఫ్( సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్) ఉద్యోగం సాధించింది. తండ్రి తన ఐదేళ్ల ప్రాయంలోనే అనారోగ్యంతో మృతి చెందగా తల్లి పిండి మిల్లు పడుతూ వచ్చే డబ్బులతో కుమారుడు, కుమార్తెను ఉన్నత చదువులు చదివించింది. తల్లి కష్టాన్ని చూసిన ఆమె దేశానికి సేవచేయాలని, తల్లి కష్టాన్ని తీర్చాలని పట్టుదలతో సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగం సాధించి ఈ నెల 12న నియామక పత్రాన్ని అందుకుంది. మధ్యప్రదేశ్‌లోని బర్వాహాలో విధుల్లో చేరింది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వనపర్తి ఆదినారాయణ శ్రీదేవి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. తండ్రి ఆదినారాయణ అనారోగ్యంతో మృతి చెందగా తల్లి శ్రీదేవి అన్ని తానై పిండి మిల్లు, కారం గిర్ని నడుపుకుంటూ కొడుకును ఫార్మసీ చేయించింది. కుమార్తె సుప్రియను దేనికి కొదవ లేకుండా పెంచింది. సుప్రియ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకుంది. ఇంటర్ వరంగల్‌లోని ప్రైవేటు కళాశాలలో చదివి ఉత్తమ ర్యాంక్ సాధించి ఉపకార వేతనంతో చదువుకుంది. ఆ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి కేయూలో ఎంఎస్సీ ఉచిత సీటు సాధించింది. మూడేళ్ల పాటు చదివిన తర్వాత దేశానికి సేవ చేయాలని, తల్లి కష్టాన్ని తీర్చాలనే ఉద్దేశంతో సెంట్రల్ ఉద్యోగానికి ప్రత్యేక శిక్షణ హైదరాబాద్‌లో తీసుకుని సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగం సాధించింది. తల్లి కష్టానికి ఫలి తాన్ని అందజేసింది. తల్లికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని తెలిపింది. చదు వు పేదరికానికి అడ్డు కాదని నిరూపించింది.


