చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
ములుగు/ములుగు రూరల్: రాష్ట్రంలోని పేదరికంలో ఉన్న చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో గల అంగన్‌వాడీ కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతిరోజూ 100 మిల్లీ లీటర్ల పాల పంపిణీ కార్యక్రమానికి సోమవారం మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ మహేందర్‌జీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు ప్రతిరోజూ పాలను అందజేయనున్నట్లు తెలిపారు. చిన్నారులకు అందించే ఆహారాన్ని ప్రతిరోజూ అంగన్‌వాడీ టీచర్లు పరిశీలించాలన్నారు. పాడైన వస్తువులు వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ప్రతీ టీచర్‌కు చీరలు పంపిణీ చేయడంతో పాటు వేతనాలను పెంచారని వివరించారు. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు ధీటుగా సెంటర్లను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. సెంటర్ల నిర్వాహకులు పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించి ప్రీ స్కూల్ చిన్నారులకు పాలను అందించారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా మంత్రి సీతక్క పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తే వారి నుంచి ఆస్తులను జప్తు చేసి తల్లిదండ్రుల మీదకు మార్పిడి చేసేఅవకాశం ఉందన్నారు. అదే విధంగా బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, డీడబ్ల్యూఓ తుల రవి, సీడీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారులకు మెరుగైన సేవలు
జిల్లాలోని వినియోగదారులకు ఇండియన్ బ్యాంక్ మెరుగైన సేవలు అందించాలని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఇండియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ గణేశ్, కరీంనగర్ జోనల్ మేనేజర్ సుధాకర్, డిప్యూటి మేనేజర్ కేశవరావు, ములుగు శాఖ నిర్వహణ అధికారి శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రీస్కూల్ చిన్నారులకు 100 మిల్లీలీటర్ల పాలు పంపిణీ
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ధనసరి సీతక్క
చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం


