3,775 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ములుగు: వానాకాలం 2025–26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన 185 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3,775 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ దివాకర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు 7,131.080 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన 3,775.120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసినట్లు వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు రూ.1.82 కోట్లను రైతులకు చెల్లించినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు 11,09,198 ఖాళీ సంచులను, 1,843 టార్ఫాలిన్ కవర్లను సరఫరా చేశామని పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటే టోల్ ఫ్రీ నంబర్ 9347416178 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఎస్‌ఈ మనోహర్, జేఈ రమాదేవీలు గద్దెల చుట్టూ నిర్మిస్తున్న సాలహారం నిర్మాణం పనులను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. అంతేకాకుండా ప్రహరీ నిర్మాణంలో ఏర్పాటు చేస్తున్న రాతి పిల్లర్లను సైతం తనిఖీ నిర్వహించారు. రాతి పిల్లర్ల వెడల్పు, పొడవు కొలతల ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించారు.
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 1వ తేది వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12వ తేది వరకు, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబరు 30వ తేదీలోపు చెల్లించాలన్నారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం పాలకమండలికి దేవాదా యశాఖ రీ నోటిఫికేషన్ వేసినట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో పలుమార్లు పాలకమండలికి నోటిఫికేషన్ వేయగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో మరోసారి 14మంది డెరెక్టర్లు, ఒక ఎక్స్‌అఫీషియో సభ్యులకు (అర్చక) నోటిఫికేషన్‌ను ఆ శాఖ కమిషనర్ ఆదేశాలతో వేశారు. ఈ నోటిఫికేషన్ వెలుబడిన 20 రోజుల్లో ఆశావహులు వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సారైనా పాలకమండలి నియామకం జరుగుతుందా లేదా అని ఆశావహులు చర్చించుకుంటున్నారు.
కాటారం: జాతీయ స్థాయి అండర్ 17 విభాగం హ్యాండ్‌బాల్ పోటీలకు మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారు. ఈ నెల 7నుంచి 9వరకు మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారుడు అజయ్ ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరఫున పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్ సాధించాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 27నుంచి 30వరకు కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో అజయ్ పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి జైపాల్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, పీడి మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, హర్షం వ్యక్తం చేశారు.


