అభివృద్ధి దశలో 5వ బెటాలియన్
● ఆధునిక జిమ్ ను ప్రారంభించిన కలెక్టర్
గోవిందరావుపేట: తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ ప్రాంగణం అభివృద్ధిలో మరో అడుగుపడింది. చల్వాయి గ్రామంలోని టీజీఎస్పీ 5వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక జిమ్, ఓపెన్ జిమ్ ను కలెక్టర్ దివాకర టీఎస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బెటాలియన్ సిబ్బంది శారీరక దృఢత్వం, క్రమ శిక్షణను పెంపొందించే దిశగా జిమ్ సెంటర్ సాయపడుతుందన్నారు. బెటాలియన్ అభివృద్ధికి, అవసరాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం కలెక్టర్‌కు స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్‌ఎఫ్) పని తీరును, వారు ఉపయోగించే ప్రత్యేక పరికరాల వినియోగం గురించి వివరించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో కలెక్టర్ పరస్పరం మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, శ్రీనివాస చారి, భాస్కర్, స్వామి, సాయిబాబు, వెంకటేశ్వర్లు, శ్రీధర్, అశోక్‌తో పాటు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.


