అన్నివర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని పలు అభివృద్ధి పనులను కలెక్టర్ టీఎస్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు శాసీ్త్రయ విద్యాబోధనకు ఉపయోగపడే విధంగా జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.50 లక్షల నిధులతో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ నిర్మిస్తున్నామని అన్నారు. విద్యార్థులు ల్యాబ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. బండారుపల్లి జంక్షన్‌లో అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం రూ.61లక్షలతో పనులను చేపట్టిందని అన్నారు. ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనానికి రూ.15 లక్షలు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవనానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గట్టమ్మ ఆలయ సమీపంలో 33/11 విద్యుత్ ఉప కేంద్రం రూ.3 కోట్ల 62 లక్షలు కేటాయించగా భూమి పూజ చేశారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలు ఆర్ధికాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామని అన్నారు. జంగాపల్లి జంక్షన్‌లో రామప్ప శిల్ప కళా సంపద, ఆలయ విశిష్టతతో కూడిన పనులు చేపట్టామని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోయానని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మంత్రిగా జిల్లా అభివృద్ధిచేసి తీరుతానని స్పష్టం చేశారు. ములుగు జిల్లాను పర్యాటక హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


