కాజీపేట రూరల్: రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కార్యరూపం దాల్చిన కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం 80శాతం పూర్తికావొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో స్థానిక యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తోపాటు మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. శనివారం రైల్వే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించనున్నారు.
వ్యాగన్‌షెడ్ టు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్..
కాజీపేట మండలం అయోధ్యపురంలో 160 ఎకరా ల్లో సుమారు రూ.786 కోట్లతో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేపట్టారు. 2023 జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో నుంచి కాజీపేట వ్యాగన్‌షెడ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. 2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాజీపేట రైల్వే మల్టీపుల్ యూనిట్‌గా ప్రకటన చేసి మంజూరు చేశారు. రీ డిజైనింగ్ చేసి జపాన్ టెక్నాలజీతో మల్టీపుల్ యూనిట్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో వ్యాగన్, కోచ్, వందేభారత్, ఎల్‌హెచ్‌బీ, మెము కోచ్‌లు తయారు చేస్తారు.
80శాతం పూర్తయిన విభాగాలు..
యూనిట్‌లోని మెయిన్‌షాప్, పెయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, సెక్యూరిటీ పోస్టు, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్/పంప్‌హౌస్, టాయిలెట్ బ్లాక్స్, ప్యాకేజీ సబ్‌స్టేషన్, షవర్ టెస్ట్, రోడ్‌వే బ్రిడ్జి, పంప్‌హౌస్/జీఎల్‌ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్ట్/ట్రాక్ గేట్, ఆర్‌యూబీ, పార్కింగ్, పాండ్, (2000 కేఎల్ కెపాసి టీ), స్క్రాప్ బిన్స్ పనులు 80శాతం పూర్తయ్యాయి.
పెండింగ్ పనులు..
రైల్వే కార్మికుల కోసం క్వార్టర్స్ నిర్మాణం, కోచ్‌ల తయారీకి షెడ్‌లలో మిషనరీ ఫిట్టింగ్, కనెక్టివిటీ రోడ్లు, ఎంట్రెన్స్ వద్ద రైల్వే వంతెన నిర్మాణం, ఇతరత్ర సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ జరగాల్సి ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చిలో యూనిట్‌ను ప్రారంభిస్తామని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. వీటిపై దృష్టిపెట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
పంజాబ్ మాదిరి ఉద్యోగ అవకాశాలు
కాజీపేటలోని కోచ్‌ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించనుంది. అయితే ఈ ఉద్యోగాలు ఉమ్మడి జిల్లావాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ కోచ్‌ఫ్యాక్టరీలో ప్రత్యేక జీఓ తీసి అక్కడి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అదేమాదిరిగా ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దీనిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు.
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
అయోధ్యపురంలో రైల్వే యూనిట్‌కు 112మంది 160 ఎకరాల భూమి ఇచ్చారు. ఇద్దరు ఇళ్లు కోల్పోయారు. మొత్తం 114మంది నిర్వాసితులు ఉండగా ప్రభుత్వం ఎకరాకు రూ.8లక్షలు చెల్లించింది. ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రూ.33 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ.8 లక్షలు రైతుకు ఇచ్చి, రూ.25లక్షలు దేవాదాయశాఖ (ఈ భూమి దేవాదాయశాఖకు సంబంధించింది)కు ఇచ్చారు. 8మంది రైతుల భూమి సీలింగ్ ల్యాండ్ అని నష్టపరిహారం నిలిపివేశారు. ఇప్పటివరకు వారికి రాలేదు. కోట్ల రూపాయల విలువైన భూమి కోల్పోయామని, రైల్వే యూనిట్‌లో ఇంటికో ఉద్యోగం ఇచ్చి రైల్వేశాఖ ఆదుకోవాలని రైతులు కేంద్రమంత్రులను కోరుతున్నారు.
రైల్వే మంత్రి దృష్టికి కాజీపేట డివిజన్ ప్రస్తావన..
రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ దృష్టికి ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్తామని స్థానిక రైల్వే నాయకులు తెలిపారు. అదేవిధంగా టౌన్ స్టేషన్ అభివృద్ధి, ఫాతిమానగర్‌లో ట్రైయాంగిల్ స్టేషన్ నిర్మాణం, కాజీపేట రైల్వే ఆస్పత్రి సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్, కాజీపేట రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాంల నిర్మాణం, అన్ని హంగులతో కూడిన రైల్వే క్లబ్ (ఇన్‌స్టిట్యూట్) భవనం, బెజవాడ తరహాలో రైల్వే ఎలక్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
చివరి దశకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు
నెరవేరుతున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం
నేడు యూనిట్‌ను విజిట్ చేయనున్న
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కొందరు రైతులకు అందని భూ పరిహారం.. స్థానికులకు ఉద్యోగ,
ఉపాధి కల్పించేనా..?
వీటిపై కేంద్రమంత్రులు స్పష్టమైన
ప్రకటన చేయాలని డిమాండ్
కాజీపేట డివిజన్ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని రైల్వే నాయకుల నిర్ణయం
ఉపాధి అవకాశాలపై ఆశలు