ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్‌కు చెందిన శీలం రఘువీర్–శ్రీదేవిల కుమార్తె మేఘన గ్రూప్–1 ఫలితాల్లో స్టేట్ 22వ ర్యాంక్, జోనల్‌లో 12వ ర్యాంక్ సాధించింది. ఎంతో కష్టపడి తన కూతురు గ్రూప్–1లో మంచి ర్యాంక్ సాధించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానికులు మంగళవారం మేఘనను అభినందించారు.
‘ప్రజా పంపిణీ బియ్యం అందించేది కేంద్రమే’
ములుగు రూరల్: రాష్ట్ర ప్రజలకు ప్రజా పంపిణీ బియ్యం ఒక్కొక్కరికి 5 కేజీలు అందించేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 2014నుంచి ఉచిత బియ్యం అందిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని ఇక్కడి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
ప్రతీ ఏడాది రూ.10వేల కోట్లు వెచ్చించి ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వ వాటాయే ఎక్కువగా ఉందని బలరాం వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, నాయకులు భూక్య జవహర్‌లాల్, రాజ్‌కుమార్, లవన్‌కుమార్, కుమారస్వామి, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లు, ఐపీఎల్ బెట్టింగ్‌లకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే భ్రమలో యువత, ప్రజలు, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. బెట్టింగ్, గేమింగ్ కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బెట్టింగ్ యాప్‌ల డౌన్‌లోడ్ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం, అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.

గ్రూప్–1 ఫలితాల్లో మేఘనకు 22వ ర్యాంక్