కిక్‌లోనే ఉంది అసలైన కిక్కు!

Tollywood And Bollywood Heroines Practising Kickboxing - Sakshi

కథానాయికలు చెట్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడే కాలం పోయింది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే కాలం వచ్చింది. ఒక్క కిక్‌ ఇస్తే చాలు... విలన్‌ విస్తుపోవాల్సిందే. ఇప్పుడు కథానాయికలూ పవర్‌ఫుల్‌ రోల్స్‌ చేస్తున్నారు. అందుకోసం చాలా నేర్చుకుంటున్నారు. కిక్‌ బాక్సింగ్‌ లాంటి క్లిష్టమైన ఆర్ట్‌ను నేర్చుకోవడానికి కూడా వెనకాడడం లేదు. పాత్ర డిమాండ్‌ చేయకపోయినా... ఫిట్‌నెస్‌ కోసం కూడా ఇవి నేర్చుకుంటున్నారు! కిక్‌లోనే ఉంది కిక్కు అంటున్నారు!!

సోమవారం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో కిక్‌ బాక్సింగ్‌ చేస్తూ కనిపించారు. శిక్షణలో భాగంగా రకుల్‌ ఇస్తున్న కిక్స్‌ సూపర్‌ అనే చెప్పాలి. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే రకుల్‌ అందులో భాగంగానే కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకుంటున్నారా? లేక ఏదైనా క్యారెక్టర్‌ కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఆ మధ్య రాశీ ఖన్నా కూడా కిక్‌ బాక్సింగ్‌ ట్రైనింగ్‌ ఆరంభించారు. ఓ సినిమా కోసమే ఆమె నేర్చుకుంటున్నారు. బాక్సింగ్‌ శారీరక బలాన్ని మాత్రమే కాదు.. మానసిక బలాన్ని కూడా పెంపొదిస్తుందని రాశీ అంటున్నారు. ‘క్యా కియా’ అనే టైపులో కియారా అద్వానీ కూడా ఆ మధ్య బాక్సింగ్‌ నేర్చుకున్నారు. ఫిట్‌నెస్‌లో భాగంగానే కియారా ఈ ట్రైనింగ్‌ తీసుకున్నారు.

ఇంకా దక్షిణాదిన సినిమాలు చేస్తున్న కథానాయికల్లో అదా శర్మ, నివేదా పేతురాజ్‌ వంటివారు కూడా బాక్సింగ్‌ రింగ్‌లోకి ఎంటరయ్యారు. ఫిట్‌నెస్‌ కోసమే కాదు.. బాక్సింగ్‌ డిమాండ్‌ చేసే క్యారెక్టర్‌ వస్తే అనే ఆలోచనతో ముందుగానే నేర్చుకున్నారు. అటు హిందీ చిత్రపరిశ్రమకు వెళితే... ఇటీవల కంగనా రనౌత్‌ కూడా కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నారు. ‘థాకడ్‌’ సినిమా కోసమే ఈ ట్రైనింగ్‌. ఇందులో ఆమె గూఢచారి పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలోని ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్‌కి రూ. 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల ఈ ఫైట్‌ని చిత్రీకరించారు. అంటే.. ఈ సినిమాలో యాక్షన్‌ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇంకా బాలీవుడ్‌లో పరిణితీ చోప్రా కూడా కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకున్నవారిలో ఉన్నారు. స్లిమ్‌ సుందరి దిశా పటానీ అయితే రకరకాల వర్కవుట్లు చేస్తారు. వాటిలో బాక్సింగ్‌ ఒకటి. కిక్‌ బాక్సింగ్‌ అనే కాదు.. అవసరమైతే కరాటే, విలువిద్య, గుర్రపు స్వారీ.. ఇలా యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి కథానాయికలు వెనకాడడంలేదు. సిల్కర్‌ స్క్రీన్‌పై తమ సత్తా చాటే విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

చదవండి: ఆ అవార్డు అందుకున్న హీరో ఎవరు?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top