సమంత చెల్లెలిగా రష్మిక

Samantha And Rashmika Acting As Sisters In Vignesh Shivan Film - Sakshi

తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు సమంత. మాతృభాష కన్నడతో పాటు తెలుగులో, తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు రష్మికా మందన్నా. దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్లుగా సత్తా చాటుతున్న సమంత, రష్మిక కలసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అది కూడా అక్కాచెల్లెళ్లుగా నటించనున్నారని టాక్‌. ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో కథని రెడీ చేసి, సమంత, రష్మికలకు ఫోన్‌లో వినిపించారట. ఇద్దరికీ నచ్చడంతో నటించేందుకు పచ్చజెండా ఊపారనే ప్రచారం జరుగుతోంది.

లేడీ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందట. ఈ ప్రాజెక్ట్‌ గురించి త్వరలో అధికారిక సమాచారం వచ్చే అవకాశాలున్నాయని టాక్‌. ఇక విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు సమంత. అంతేకాదు.. నిర్మాతగా మారి మలయాళ హిట్‌ మూవీ ‘హెలెన్‌’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. రష్మికా మందన్నా విషయానికొస్తే... తెలుగులో ‘పుష్ప’, కన్నడలో ‘పొగరు’, తమిళంలో ‘సుల్తాన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top