‘చెక్‌’ మూవీ రివ్యూ

Nithiin Check Telugu Movie Review And Rating - Sakshi

టైటిల్‌ : చెక్‌
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, సాయిచంద్‌, పోసాని కృష్ణమురళి, మురళి శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ : భవ్య క్రియేషన్స్‌
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్‌ 
దర్శకత్వం : చంద్రశేఖర్‌ యేలేటి
సంగీతం : కల్యాణీ మాలిక్‌
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటర్‌ : అనల్ అనిరుద్దన్ 
విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021

చాలా కాలం తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో. భీష్మ కంటే ముందు నితిన్‌ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్‌ తీసుకొన్న నితిన్‌.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి  చెక్‌. భీష్మతో పాటు చెక్‌ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్‌  తర్వాత శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్‌’పై నితిన్‌ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్‌ మరో హిట్‌ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.

కథ
ఆదిత్య ఒక తెలివైన యువకుడు. తన తెలివితేటలన్నింటిని చోరకళ(దొంగతనం) కోసం ఉపయోగిస్తాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి యాత్ర ( ప్రియా ప్రకాశ్‌ వారియర్) పరిచమతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కట్‌ చేస్తే... భారత్‌లో ఉగ్రదాడి జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో ఆదిత్య  ఉరిశిక్ష పడుతోంది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆదిత్యకు జైలులో శ్రీమన్నారాయణ(సాయిచంద్)అనే ఖైదీ పరిచయమై చెస్‌ ఆటను నేర్పిస్తాడు. ఆదిత్య తెలివికి నేషనల్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ గెలుస్తాడని బలంగా నమ్మిన శ్రీమన్నారాయణ.. తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్‌ గేమ్‌ ఆడేలా ఒప్పిస్తాడు.

ఇదిలా ఉంటే ఆదిత్యకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్‌ లాయర్‌ మానస(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) ప్రయత్నిస్తుంది. చెస్‌లో ఆరితేరిన ఆదిత్యకు ఆ గేమే క్షమాభిక్ష పెట్టాలా చేస్తుందని బలంగా నమ్మి ఆ రకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ నరసింహారెడ్డి(సంపత్‌ రాజ్)‌ ఆదిత్యకు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకి ఆదిత్యకు క్షమాభిక్ష లభించిందా లేదా? అసలు ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్‌ అయ్యాడు? యాత్ర ఎవరు? చెస్‌ గేమ్‌ ఆదిత్యకు ఎలా ఉపయోగపడింది? ఎస్పీ నరసింహారెడ్డికి ఆదిత్య అంటే ఎందుకు కోపం? చివరకు జైలు నుంచి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ

నటీనటులు
చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఆదిత్య పాత్రలో నితిన్‌ ఒదిగిపోయాడు. ఒక చెస్‌ చాంపియన్‌ ఎలా ఆడగలడో, ఏ రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేయగలడో అచ్చుగుద్దినట్లు నితిన్‌ నటన ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్‌ కూడా చాలా చక్కగా చేశాడు.‌ ఇక లాయర్‌ పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చక్కగా నటించింది. గత చిత్రాలకు బిన్నంగా ఇందులో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనతో మెప్పించింది. లాయర్‌ మానస పాత్రలో హవాభావాలు అద్భుతంగా పండించింది.  

ఇక నితిన్‌ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయిచంద్‌ది. చేయని తప్పుకు జైలుపాలైన శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్‌ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాకే హైలెట్‌. ఇక మరో హీరోయిన్‌ ప్రియ ప్రకాశ్‌ వారియర్‌కు‌ ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్ర నిడివి కొద్దిసేపే అయినప్పటికీ సినిమాకు ఆమె సన్నివేశాలే కీలకం. యాత్ర పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఎస్పీ పాత్రలో సంపత్‌ రాజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్ తండ్రి పాత్రలో పోసాని, జైలర్‌గా మురళి శర్మ తమ పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ
వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించడంలో చంద్రశేఖర్‌ యేలేటి సిద్ధహస్తుడు. ఆయన కథలు జీవితాల్లో నుంచి పుడతాయి. ఆ జీవితాల చుట్టూనే తిరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోను కొన్ని సంఘటనలు.. అవి అందించే ఎమోషన్లు ఉంటాయి. అలాంటి కథలను తీసుకుని.. అనుభూతి ప్రధానంగా తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. చెక్‌ సినిమా కూడా అంతే. గత సినిమాలే మాదిరే మైండ్‌ గేమ్‌కి పెద్ద పీట వేశాడు. క్షమా భిక్ష, చెస్‌ గేమ్‌ నేపథ్యంలో కథనంతా నడిపించాడు దర్శకుడు.  ఫస్టాఫ్‌ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్‌ చేయకుండా నార‍్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడికి బోర్‌ కొట్టిస్తాయి.

ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ట్విస్ట్‌లన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. కానీ ఎక్కువ సన్నివేశాలు జైలులోనే కనిపించడం కాస్త బోర్‌ కొట్టించే అంశం. ఇక నేషనల్‌ చెస్‌ చాంపియన్‌ విజేతగా హీరో నిలిచే సన్నివేశాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అలాగే లాయర్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇలా వచ్చి అలా వేళ్తున్నట్లు అనిపిస్తోంది. ఇక క్లైమాక్స్‌ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించదు. ఇక్కడా దర్శకుడు యేలేటి తన మార్క్‌ను చూపించాడు. కానీ అంతగా వర్కౌట్‌ కాలేదనిపిస్తోంది. అయితే  హీరో ఎలా బయటపడ్డాడో చెప్పే విశ్లేషణ మాత్రం బాగుంటుంది. అలాగే సీక్వెల్‌ ఉంటుందని చెప్పకనే చెబుతూ కథను ముగించాడు దర్శకుడు. స్క్రీన్‌ ప్లే బాగుంది. ఇక కల్యాణీ మాలిక్‌ సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్‌ పాయింట్‌. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఉన్న ఒక్క పాట పర్వాలేదనిపిస్తోంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫి బాగుంది. జైలు సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. అనల్ అనిరుద్దన్ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి

 

ప్లస్‌ పాయింట్స్‌
కథా, కథనాలు
నితిన్‌, సాయిచంద్‌ నటన
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌
సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సీన్లు
క్లైమాక్స్‌

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top