Kangana Ranaut: ఎందుకు బతుకున్నామా అని ఫీలయ్యేలా చేస్తారు

Kangana Ranaut Says Someone Never Be Able To Decide What Is Worse - Sakshi

విజేతలు ఎల్లప్పుడూ ఒంటరివారే

ముంబై: తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటారు బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌. ఏ అండా లేకుండానే బీ-టౌన్‌లో అడుగుపెట్టిన ఆమె.. అనేక కష్టనష్టాలకోర్చి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతమంది, ఎన్నిరకాలుగా తనను విమర్శించినా లెక్కచేయక కెరీర్‌పై దృష్టిసారించి పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బోల్డ్‌ క్యారెక్టర్లతోనే గాకుండా సామాజిక అంశాలు, సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం కంగనాకు అలవాటేనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
ఇక సోషల్‌ మీడియాలో అభిమానులకు చేరువగా ఉండే ఈ ఫైర్‌బ్రాండ్‌ సోమవారం ఓ స్ఫూర్తిమంతమైన కోట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ‘‘నువ్వు విఫలమైతే చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను వదిలేస్తారు. పనికిరాని వాళ్లలా మనల్ని చూస్తారు. అసలు ఈ ప్రపంచంలో ఎందుకు బతుకున్నామా అనే భావన కలిగేలా వ్యవహరిస్తారు. అదే ఒకవేళ నువ్వు.. సమస్యలన్నింటినీ అధిగమించి విజయం సాధిస్తే.. అప్పుడు కూడా నిన్ను వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తారు. 

నిన్ను లక్ష్యంగా చేసుకుని ఒంటరిని చేసి, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోయేలా కుట్రలు చేస్తారు. అయితే.. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయం.. విజేతలు ఎల్లప్పుడూ ఒంటరివారే. కాబట్టి మనం ఒంటరిగానే నిలబడాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే.. జయాపజయాలను ఎవరూ నిర్ణయించలేరు. ఏదేమైనా ముందుకు సాగిపోవడమే పని’’ అని కంగనా రనౌత్‌ తన ఫాలోవర్లలో ధైర్యం నూరిపోశారు. కాగా తన సినీ ప్రయాణాన్ని ప్రతిబింబించే దృశ్యాలతో కూడిన వీడియోను కంగనా ఆదివారం ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. భవద్గీతలో కృష్ణుడు చెప్పింది తాను విశ్వసిస్తానని, చెడులో కూడా మంచిని చూసే స్వభావం తనకు ఉందంటూ చెప్పుకొచ్చారు.

చదవండి: Shefali Jariwala: మగాడు పది పెళ్లిళ్లు చేసుకున్నా తప్పులేదా..
యోగా మా అక్కను మనిషిని చేసింది...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top