
బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈడీ దూకుడు చూపింది. ఈ కేసులో 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు 4 కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. అందులో సినీ నటీనటులతో పాటు యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. కేసు నమోదు అయిన వారిలో విజయ్ దేవరకొండతో పాటు రానా ,మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి, ప్రణిత, విష్ణు ప్రియ వంటి ప్రముఖులు ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి కేసు విచారణ ప్రారంభించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను వారు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఐటీ రిటర్న్లలో ఈ లెక్కలు లేవని అధికారులు గుర్తించారట. దీంతో మనీ లాండరింగ్ కింద కేసు ఈడీ కేసు నమోదు చేసింది.
బెట్టింగ్ యాప్‌లకు విషయంపై గతంలోనే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి టీమ్ ఒక ప్రకటన చేసింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు వారు ప్రచారకర్తలుగా వ్యవహరించలేదని, నైపుణ్య ఆధారిత గేమ్‌లకు మాత్రమే ప్రచారం చేశారని వారిద్దరి టీమ్స్ వేర్వేరుగా ప్రకటన చేశాయి. చట్టపరమైన అనుమతులు ఉన్న వాటికి మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని వారు తెలిపారు. ఏ23 అనే కంపెనీతో విజయ్ చేసుకున్న ఒప్పందం ఇప్పటికే ముగిసిందని తెలుపగా రానా కుదుర్చుకున్న ఒప్పందం 2017లోనే పూర్తయ్యిందని పేర్కొన్నారు. నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా 2016లోనే తను ఒప్పందం చేసుకున్న కంపెనీతో ఢీల్ ముగిసిందని తెలిపారు. అయితే, బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే చాలామంది నటీనటులను హైదరాబాద్ పోలీసులు విచారించారు.
