కొనుగోడు | - | Sakshi
Sakshi News home page

కొనుగోడు

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం వేధిస్తున్న హమాలీల కొరత అన్‌లోడింగ్‌ చేయని మిల్లర్లు

జిల్లాలో ఇలా..

లక్ష్యం 3.50 లక్షల మె.ట

ఇప్పటివరకు కొన్నది 2.11 లక్షల మె.ట

ఇంకా సేకరించాల్సింది 1.39 మె.ట

రైస్‌ మిల్లులు 100

కొనుగోలు కేంద్రాలు 533

మెదక్‌జోన్‌: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అవస్థలు పడుతున్నారు. చివరి గింజ కొంటామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలు రావడం లేదు. అధికారులు ముందస్తు ఆలోచన చేయకపోవటంతో హమాలీల కొరత ఏర్పడింది. ఎంతమంది అవసరమో అంచనా వేయటంతో, పాటు వారిని సకాలంలో రప్పించటంలోనూ విఫలమయ్యారు. ఏటా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగానే జిల్లాకు బీహార్‌కు చెందిన హమాలీలు ఎక్కువగా వచ్చేవారు. కాగా ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగటంతో వారి రాక ఆలస్యమైంది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగానే ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాత.. గుండెకోత

జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈ యాసంగి సీజన్‌లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని సెంటర్లలో తూకం వేయటం ఆలస్యం అవుతుండగా, మరికొన్ని చోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతుంది. ఫలితంగా రైతులు ఏదో ఒక చోట ఆందోళనలు చేపడుతున్నారు. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఓ రైతు బలవన్మరణం చెందగా, మరో రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ రెండు ప్రభుత్వ హత్యలని ప్రతిపక్షాలు విమర్శిస్తే, అధికారులు మాత్రం వారి మరణాలకు వేరే కారణం ఉందని అంటున్నారు.

లారీలు లేక.. కొనుగోళ్లు సాగక

బ్లాక్‌ లిస్టులో 6 రైస్‌ మిల్లులు

చిన్నశంకరంపేట మండలం శాలిపేట కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి 10 రోజులు కావొస్తుంది. సకాలంలో లా రీలు రాకపోవటంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. ధాన్యం రైస్‌ మిల్లులకు చేరే వరకు పూర్తి బాధ్యత సదరు రైతులదే కావటంతో కర్షకులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇది ఒక్క శాలిపేటలోనే కాదు జిల్లాలోని వందలాది కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి.

జిల్లాలో 132 రైస్‌ మిల్లులు ఉండగా, వాటిలో 32 మిల్లులపై పలు రకాల కేసులు ఉండటంతో వాటికి ధాన్యం కేటాయించలేదు. మిగితా 100 మిల్లులకు యాసంగిలో ధాన్యం కేటాయించారు. వాటిలో 61 రారైస్‌, 39 బాయిల్డ్‌ మిల్లులకు కేటాయించగా, వాటిలో ఇప్పటివరకు 6 రారైస్‌ మిల్లుల యాజమాన్యాలు, యాసంగిలో నూకశాతం అధికంగా ఉంటుందనే కారణం చూపి ధాన్యం దింపుకోవటంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ రైస్‌ మిల్లులను బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement