
తెలంగాణ తల్లి పాత ఫొటోతో!
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వం తెలంగాణ తల్లి ముఖచిత్రం మార్చినా అధికారులు మాత్రం నేటికీ తెలంగాణ తల్లి పాత ఫొటోలనే ఉపయోగిస్తున్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటం పాతదే పెట్టారు. దీంతో జాతీయ జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. అలాగే చిన్నశంకరంపేట ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించగా.. తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం తహసీల్దార్ సమయానికి రాకపోవడంతో జాతీయ జెండాను సమయానికి ఆవిష్కరించలేదు. దాదాపు 9:15 నిముషాల వరకు వేచి చూసిన ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లిపోగా.. ఆ తర్వాత తహసీల్దార్ మాలతి వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు.