
కేజీబీవీలో తీవ్ర నీటి ఎద్దడి
మూడు రోజులుగా స్నానం చేయని విద్యార్థినులు
రామాయంపేట(మెదక్): రామాయంపేట కేజీబీవీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో మూడు రోజు లుగా స్నానాలు చేయలేదని విద్యార్థినులు వాపోయారు. నీరు లేకపోవడంతో మూత్ర శాలలు, మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం ఒకే భవనంలో రామాయంపేట, నిజాంపేట కేజీబీవీ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇందులో మొత్తం 330 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నీటి ఎద్దడి విషయం తెలుసుకొని తహసీల్దార్ రజనికుమారి శుక్రవారం స్కూల్‌ను సందర్శించారు. నీటి ఎద్దడితో తాము ఇబ్బంది పడుతున్నామని, మూడు రోజులుగా స్నానాలు చేయలేదని విద్యార్థినులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా తహసీల్దార్ టీచర్లతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండటంతో భగీరథ నీరు సరిపోవడం లేదని, సమస్య పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.