ఆదాయానికి గండి!

నర్సాపూర్‌లోని దుకాణ సముదాయం ఇదే.. - Sakshi

నిరుపయోగంగా దుకాణ సముదాయం పట్టించుకోని అధికారులు

నర్సాపూర్‌: రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన దుకాణ సముదాయాన్ని వినియోగంలోకి తేవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించిన కాంట్రాక్టర్‌కు, మార్కెట్‌ కమిటీ అఽధికారుల మధ్య సమన్వయ లోపంతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ వినియోగంలోకి రావడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

రూ. 81 లక్షలతో నిర్మాణం

నర్సాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో నర్సాపూర్‌–వెల్దుర్తి మార్గంలో రూ. 81 లక్షలు వెచ్చించి పది మడిగెల దుకాణ సముదాయాన్ని నిర్మించారు. ఈ సముదాయ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే గతేడాది నవంబరు 19వ తేదీన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. నాలుగున్నర నెలలు గడుస్తున్నా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు ఇంత వరకు దుకాణాలకు అద్దె లేదు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు ఇంకా పూర్తి కాలేదని మార్కెట్‌ కమిటీ అధికారులు ప్రకటించగా, అన్ని పనులు పూర్తి చేశానని కాంట్రాక్టర్‌ చెబుతున్నాడు. ఇరువర్గాల ప్రకటనలు భిన్నంగా ఉండడంతో మార్కెట్‌ కమిటీ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని షాపింగ్‌ కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. కాగా దుకాణ మడిగెలకు అద్దె నిర్ణయించి వాటిని వ్యాపారులకు అద్దెకు ఇస్తే వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి నెలకు సుమారు రూ.50 వేల ఆదాయం వస్తుందని, దుకాణ మడిగెల కేటాయించే సమయంలో బహిరం్చగ వేలం పెడితే రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని తెలిసింది. అధికారుల నిర్లక్ష్యంతో మార్కెట్‌ కమిటీకి నెలనెలా వచ్చే ఆదాయం రాకుండా పో తోందని విమర్శలు వెల్లువెల్తుతున్నాయి.

కాంప్లెక్స్‌ను మాకు అప్పగించలేదు

దుకాణ సముదాయంలో మడిగెలను వ్యాపారులకు అద్దెకు ఇవ్వని విషయంపై స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి ఐశ్వర్యలక్ష్మిని వివరణ కోరగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ను తమకు ఇంకా అప్పగించలేదన్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. కాంప్లెక్స్‌ వెనుక ప్రహరీ నిర్మించాల్సి ఉందని, మడిగెల లోపల చిన్న చిన్న పనులు ఉన్నాయని సదరు కాంట్రాక్టర్‌ వాటిని పూర్తి చేసి తమకు అప్పగించాల్సి ఉంటుందని చెప్పారు. తమకు అప్పగించిన తర్వాత మడిగెలను వ్యాపారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

అన్ని పనులు పూర్తి చేశా

మార్కెట్‌ కమిటీ ఆవరణలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్రిమెంట్‌ మేరకు అన్ని పనులు పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ రాజుయాదవ్‌ చెప్పారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ వెనుక ప్రహరీ నిర్మాణం అగ్రిమెంట్‌లో లేదని చెప్పాడు. దుకాణ మడిగెలలో వైరింగ్‌ పనులు పూర్తయ్యాయని, కరెంటు కనెక్షన్‌లో భాగంగా మీటర్లు బిగించాల్సి ఉందని, వాటిని సంబంధిత శాఖ అధికారులే చూసుకుంటారని చెప్పాడు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top