చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రమాణ స్వీకారం చేయిస్తున్న కలెక్టర్‌ రాజర్షిషా, పక్కన అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ 
 - Sakshi

కలెక్టర్‌ రాజర్షి షా

మెదక్‌ కలెక్టరేట్‌: చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహిస్తున్న పోషణ అభియాన్‌–పోషణ్‌ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో పోషణ అభియాన్‌–పోషణ్‌ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల స్టాల్స్‌ను అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం చిన్న పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన పూర్వీకులు తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల బీపీ, షుగర్‌ లేకుండా వందేళ్లు జీవించే వారన్నారు. ప్రస్తుతం జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం, పురుగుల మందు వాడకంతో పండించిన ఆహారం తినడంవల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల ఆహార అలవాట్లలో మార్పు వస్తోందన్నారు. వచ్చే ఖరీఫ్‌లో తృణ ధాన్యాలైన కొర్రలు, సామలు వంటి పంటలు వేసేలా, వాటి ప్రాసెస్‌, వాడకం పై రైతులకు అవగాహన కలిగించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో అంగన్‌ వాడీల వ్యవస్థ ఎంతో గొప్పదన్నారు. పోషణ్‌ అభియాన్‌ డాష్‌ బోర్డు ప్రకారం నిర్దేశించిన ఇండికేటర్స్‌లో జిల్లా ప్రథమ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, అతి పోషకాహార లోపం గల పిల్లలను సాధారణ స్థితికి తీసుకురావడంలో (మామ్‌–సామ్‌ ) గణనీయమైన ప్రగతి సాధించారన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top