‘ఆరోగ్య మహిళ’కు మంచి స్పందన

- - Sakshi

మెదక్‌ కలెక్టరేట్‌: మహిళలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేయడమే లక్ష్యంగా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లాలో ఈ కేంద్రాలకు చక్కటి స్పందన ఉందని కలెక్టర్‌ రాజర్షిషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మంగళవారం మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కేంద్రాలను నెలకొల్పినట్టు పేర్కొన్నారు. ఇందులో 953 మంది మహిళలకు వైద్య నిర్ధారణ పరీక్షలు చేశామన్నారు. మెరుగైన వైద్యం, అవసరమైన వారికి చికిత్స కోసం 38 మందిని జిల్లా ఆస్పత్రికి, మరో 8 మందిని హైదరాబాద్‌కు రెఫర్‌ చేసినట్టు వివరించారు. వైద్య పరీక్షల నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా ద్వితీయ స్థానంలో ఉందన్నారు. క్లినిక్‌కు వచ్చే మహిళల వివరాలను ప్రత్యేక యాప్‌లో పకడ్బందీగా నమోదు చేస్తున్నామని తెలిపారు.

2,57,613 మందికి కంటి పరీక్షలు

జిల్లాలో శుక్రవారం వరకు 2,57,613 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. ఇందులో 1,20,673 మంది పురుషులు, 1,36,877 మంది మహిళలు, 22 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారన్నారు. 469 గ్రామ పంచాయతీలు, 75 మున్సిపల్‌ వార్డులకు గానూ ఇంతవరకు 259 గ్రామ పంచాయతీలు, 45 మున్సిపల్‌ వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి చేశామని వివరించారు. ఇప్పటివరకు 30,172 మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ చేశామన్నారు. కాగా 1,97,447 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేని వారిగా గుర్తించినట్లు చెప్పారు.

కలెక్టర్‌ రాజర్షిషా

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top