ఎస్సీ వర్గీకరణకు కేంద్రమే అడ్డు

బీడీ కార్మికులతో మాట్లాడుతున్న సత్యం - Sakshi

రామాయంపేట(మెదక్‌): ఎస్సీ వర్గీకరణను బీజేపీ ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌ మాదిగ అన్నారు. మాదిగల సంగ్రామ యాత్ర ఆదివారం జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా రామాయంపేటలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మాదిగలు ఓటు వేయరని చెప్పారు. మరో పోరాటానికి మాదిగలను సిద్ధం చేయడానికే ఈయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. గతంలో తమ ఆందోళనకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఇప్పుడు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు. యాత్ర ఏప్రిల్‌ 4న ముగుస్తుందని.. అదే రోజు లక్షలాది మందితో హైదరాబాద్‌ను ముట్టడిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, మురళి, జిల్లా అధ్యక్షుడు మల్యాల కిషన్‌, మిద్దె శాంతికుమార్‌, స్వామి, రత్నం, మల్లేశ్‌ పాల్గొన్నారు.

బీడీ కార్మికులకు

కరువు భత్యం చెల్లించాలి

రామాయంపేట(మెదక్‌): రాష్ట్రవ్యాప్తంగా బీడీ కార్మికులకు కరువుభత్యం చెల్లించాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంది సత్యం డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మండలంలోని కోనాపూర్‌లో బీడీ కార్ఖానాలను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. పెరిగిన కరువు భత్యాన్ని ఏప్రిల్‌ ఒకటి నుంచి వర్తింపచేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నెలలో కనీసం 25 రోజులు బీడీ కార్మికులకు పని కల్పించాలని కోరారు.

జాతీయస్థాయి పోటీలకు ఏఈఓ రాజశేఖర్‌ గౌడ్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): కౌడిపల్లి ఏఈఓ రాజశేఖర్‌గౌడ్‌ జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. ఈసందర్భంగా ఆదివారం పూణే వె ళ్లాడు. ఇటీవల ఉద్యోగులకు నిర్వహించిన ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ పోటీల్లో 200, 400 మీటర్ల రన్నింగ్‌లో ఏఈఓ మొదటి స్థానంలో నిలిచారు. ఈనెల 27 నుంచి పూణేలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొననున్నారు. ఏఈఓను ఏడీఏ పద్మ, ఆత్మ కమిటీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, ఏఓ స్వప్న, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు సార రామాగౌడ్‌, తదితరులు అభినందించారు.

రెవెన్యూ డివిజన్‌ సాధనకు నేటి నుంచి దీక్షలు

రామాయంపేట(మెదక్‌): రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం సోమవారం నుంచి రామాయంపేటలో మళ్లీ నిరాహార దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం సమావేశమైన అఖిలపక్షం ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏడు నెలల పాటు దీక్ష చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇటీవల రామాయంపేటలో డివిజన్‌ సాధన కోసం ర్యాలీ, పట్టణ బంద్‌ నిర్వహించారు. కాగా ఈ దీక్షలకు పరోక్షంగా బీఆర్‌ఎస్‌ నాయకులు సహకారం అందజేస్తున్నట్లు సమాచారం. వ్యాపారవర్గాలు, కుల సంఘాలు, ఇతర పార్టీల వారు సైతం మద్దతు పలుకుతున్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top