‘కంటి వెలుగు’పై అలసత్వం వద్దు

కొల్చారం: సిబ్బందిని ప్రశ్నిస్తున్న కలెక్టర్‌ రాజర్షిషా - Sakshi

● కలెక్టర్‌ రాజర్షిషా

కొల్చారం(నర్సాపూర్‌): ‘కంటి వెలుగు’ కార్యక్రమంపై అలసత్వం తగదని.. గడువులోగా టార్గెట్‌ను పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా సిబ్బంది ఆదేశించారు. శుక్రవారం మండలంలోని వరిగుంతం గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిబిరం చివరి రోజు కావడం.. ఇంకా కంటి పరీక్షలు నిర్వహించుకోని వారు 300కుపైగా ఉండడంతో ఎప్పుడూ పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అదనంగా శిబిరం మరో రోజు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ గణేశ్‌రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో రోజుకు సరాసరి 150కి పైగా కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యం కాగా అంతకుమించి చేస్తున్నారని వివరించారు. జిల్లాలో 41 బృందాల ద్వారా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 17 వేల మందికి కంటి అద్దాలు అందించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబ, డాక్టర్‌ కిరణ్‌, జెడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్‌ ఉమా, కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కృతిక, ఏపీఓ మహిపాల్‌రెడ్డి, ఏపీఎం సుశిల్వ, సంతోష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధికి సహకరించాలి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా సమగ్రాభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రమేశ్‌తో కలిసి పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి పారిశ్రామికవేత్త తమ లాభాల్లో రెండు శాతం సీఎస్‌ఆర్‌ కింద సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగం వల్ల ఆశించిన ఫలితాలు రావాలంటే కలెక్టర్‌ ఖాతాకు డబ్బులు జమ చేయాలని సూచించారు. అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అందరికి న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగం చక్కటి ప్రణాళికతో దశల వారీగా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తద్వారా జిల్లా అన్ని రంగాల్లో పురోగమిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, వివిధ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top