● ఎరువు బరువు.. ఇంధన వాత ● రూ.8.50 కోట్లు అదనపు మోత ● పెట్టుబడికి రైతుల బెంబేలు | - | Sakshi
Sakshi News home page

● ఎరువు బరువు.. ఇంధన వాత ● రూ.8.50 కోట్లు అదనపు మోత ● పెట్టుబడికి రైతుల బెంబేలు

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

● ఎరువు బరువు.. ఇంధన వాత ● రూ.8.50 కోట్లు అదనపు మోత ● పెట్టుబడికి రైతుల బెంబేలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు పెట్టుబడి భారంగా మారింది. ఇప్పటికే ఇంధన వాతతో విలవిలలాడుతుండగా.. మరోవైపు ఎరువుల ధరలు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గత నెల రోజుల వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.8నుంచి రూ.9వరకు పెరిగింది. దీంతో దుక్కి దున్నేందుకు ట్రాక్టర్ల కిరాయి, ఇతర యంత్రాల వినియోగంతో ఇంధన ఆర్థిక భారం మోయాల్సి వస్తోంది. ఖరీఫ్‌లో అధికంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటల సాగు ఉంటుంది.

89,010 మెట్రిక్‌ టన్నుల ఎరువులు

జిల్లాలో 3.54 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. యూరియా 28,620 మెట్రిక్‌టన్నులు, డీఏపీ 13,305, ఎంవోపీ 8,352, ఎస్‌ఎస్‌పీ 3,308, ఎన్పీకేఎస్‌ 35,425 మెట్రిక్‌టన్నులు మొత్తంగా 89,010 మెట్రిక్‌టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఇందులో కాంప్లెక్స్‌ ఎరువులు 46,980 మెట్రిక్‌ టన్నుల వరకు వినియోగిస్తారు. యూరియా ధర మినహాయించి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగనున్నాయి. గతంతో పోలిస్తే ఎరువుల రకాన్ని బట్టి ఒక్కో బస్తాపై రూ.200 నుంచి రూ.500 వరకు పెరగనున్నట్లు జిల్లాలోని ఎరువుల దుకాణదారులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా పెరిగిన ముడిపదార్థాల ధరలు, రవాణా ఇబ్బందులు తలెత్తడం, తరలించే నౌకలు బీమా ప్రీమియం ధరలు భారీగా పెంచాయి. దీంతో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు సైతం పెరగనున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా రైతులపై రూ.6.50 కోట్ల మేర భారం పడనుంది. ప్రధానంగా పంటలకు వినియోగించే 45కిలోల యూరియా రూ.266.50, డీఏపీ బస్తాకు రూ.1,305కు లభిస్తోంది. వీటి ధరలు పెరగకపోవడం రైతులకు కొంత ఊరటనిస్తుంది. కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ భారం భరిస్తుంది. మిగతా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడం వల్ల ఆర్థిక భారం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.

ఖర్చులు పెరిగితే కష్టమే..

ఇప్పటికే డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో దుక్కి దున్నడానికి ట్రాక్టర్‌ కిరాయిలు పెంచిండ్రు. మరో దిక్కు ఎరువుల ధరలు పెంచితే ఈ వానాకాలం సాగు చేయడం కష్టమే అవుతుంది. పెరిగిన పెట్టుబడులతో పంటలు సాగు చేసి అప్పుల పాలవడం కంటే వదిలేసి కూలీ పని చేసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది.

– ఆర్‌.శంకర్‌, గ్రామం: ఘన్‌పూర్‌, మం: నెన్నెల

ధరలు తగ్గించాలి..

సాగు ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే ఏటికేటా పెరుగుతూనే ఉన్నయి. ప్రకృతి సహకరించక ఆశించిన పంటల దిగుబడులు రావడం లేదు. వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. అయినా వ్యవసాయాన్నే నమ్ముకోవాల్సి వస్తుంది. ధరలు ఇట్లా పెంచుకుంటే పోతే అప్పులే మిగుల్తయి. ఇంధన, ఎరువుల ధరలు తగ్గించి రైతులను ఆదుకోవాలి.

– మోతే రాజన్న, కన్నెపెల్లి

Advertisement
 
Advertisement
Advertisement