ఏడవ తరగతి సర్టిఫికెట్లకు తప్పని ఇక్కట్లు
పాఠశాలల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షిణ
ప్రీప్రైమరీ పాఠశాలలో దరఖాస్తులకు అడ్డంకులు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 72 ప్రీప్రైమరీ పాఠశాలల్లో బోధకులు, ఆయా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియెట్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పోస్టుల కోసం ఏడో తరగతి(మెమో తప్పనిసరి) ఉత్తీర్ణులై ఉండాలని ప్రకటించడంతో ఆశావహులు పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 8వ తేదీ తుది గడువు కావడంతో సర్టిఫికెట్ లేకుండా ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు వెళ్తే రికార్డులు అందుబాటులో లేవనే సమాధానం రావడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో పేర్కొన్న అర్హతలు ఉన్న వారినే తీసుకోవాలని, అంతకంటే అధిక అర్హతలున్నా తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. అధికర అర్హతలు ఉన్నా ఏడో తరగతి సర్టిఫికెట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
రికార్డులు ఎక్కడున్నాయో..?
పాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. మూసివేసిన పాఠశాలలతోపాటు చాలా స్కూళ్లలో రికార్డులు సరైన విధంగా సంరక్షించకపోవడంతో ధ్రువీకరణకు అవసరమైన సర్టిఫి కెట్లు పొందడంలో కష్టాలు పడాల్సి వస్తోంది. మరో వైపు పాఠశాలల్లో కాకుండా 2008కు ముందు ఏడో తరగతికి కామన్ బోర్డు ఎగ్జామ్ ఉండేది. ఉమ్మడి ఆదిలాబాద్ డీసీఈబీ కార్యాలయంలో విద్యార్థుల రికార్డులు ఉన్నాయని తెలుస్తోంది. ఎంతమేరకు భద్రపర్చారో తెలియదు గానీ అక్కడికి వెళ్లి వెతకడం అనేది ఒకట్రెండు రోజుల్లో పూర్తయ్యే పని కాదు. దీంతో దరఖాస్తు సమయం గడిచిపోతుంది.


