నస్పూర్: జిల్లాలో ధాన్యం అన్‌లోడింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ గోదామును సందర్శించి వరి ధాన్యం, మొక్కజొన్న దిగుమతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసి కేటాయించిన ప్రకారం ధాన్యాన్ని తరలించడం జరుగుతుందన్నారు. ధాన్యంతో పాటు గోదాములకు వచ్చిన మొక్కజొన్నలను దిగుమతి చేసి నిల్వ చేయాలని నిర్వాహకులకు సూచించారు. హమాలీలకు వేతనం చెల్లింపులపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌తో మాట్లాడి సకాలంలో కూలి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలి
నస్పూర్: ఓటరు జాబితా సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్‌లోని కలెక్టర్ చాంబర్‌లో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణన చేపట్టి 31న ముసాయిదా జాబితా ప్రచురించాలన్నారు. 31 నుండి ఆగస్టు 30 వరకు జాబితాపై వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు పరిష్కరించాలన్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును పరిశీలించారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాపల్లి జీపీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నందువల్ల అందుకు అనువైన పంటలు సాగు చేసేలా వ్యవసాయాధికారులు రైతులను చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్, ఎంపీడీవో సాయివెంకట్‌రెడ్డి, ఎంపీవో సుమన్, ఎంఈవో తిరుపతిరెడ్డి, సర్పంచ్ మిట్టపల్లి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


