ఆశపడ్డారు.. పట్టుబడ్డారు | - | Sakshi
Sakshi News home page

ఆశపడ్డారు.. పట్టుబడ్డారు

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

సైబర్‌ నేరగాళ్లతో చేతులు కలిపిన ఐదుగురు ఇప్పటికే ముగ్గురు అరెస్టు.. మరో ఇద్దరు అదుపులోకి.. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్‌టౌన్‌: డబ్బుపై ఆశతో సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు అప్పగించి ఆన్‌లైన్‌ మోసాలకు సహకరించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేయగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో గురువారం ఎస్పీ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన నిమ్మ గజేందర్‌, మగ్గిడి నవీన్‌, మహేందర్‌, సోన్‌ మండలంలోని మాదాపూర్‌కు చెందిన మేకల నిఖిల్‌, సాయికృష్ణలు కలిసి 2024 నుంచి తమ పేర్లతోపాటు వ్యాపార సంస్థల పేర్లతో వివిధ బ్యాంకుల్లో కరెంట్‌ అకౌంట్‌ ఖాతాలు ప్రారంభించారు. వాటికి సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్‌బుక్‌లు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలను సైబర్‌ నేర ముఠాలకు అందజేశారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో అమాయకుల బ్యాంక్‌ ఖాతాల నుంచి నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేసేవారు. ఇందుకు సహకరించిన వారికి కమీషన్లు అందజేసేవారు. ఇందులో గజేందర్‌కు చెందిన ఆర్వి ట్రేడర్స్‌ ఖాతా ద్వారా రూ.2.69 కోట్లు, మగ్గిడి నవీన్‌కు చెందిన అజాన్‌ ట్రేడర్స్‌ ఖాతా ద్వారా రూ.2.11 కోట్లు, మహేందర్‌కు చెందిన ఎన్‌.ఆర్‌ ఎంటర్ర్‌పైజెస్‌ ఖాతా ద్వారా రూ.91.36 లక్షలు, మేక నిఖిల్‌కు చెందిన హెచ్‌.ఆర్‌ ఆటోమొబైల్స్‌ హారడ్వర్‌ ఖాతా ద్వారా రూ.1.18 కోట్లు, సాయికృష్ణకు చెందిన హెచ్‌ఎన్‌ ఎంటర్ర్‌పైజెస్‌ ఖాతా ద్వారా రూ.1.28 కోట్లు ఇలా మొత్తం సుమారు రూ 8.18 కోట్లు పైగా లావాదేవీలు జరిగాయి. వీరిపై ఎన్సీఆర్పీ పోర్టల్‌లో 64 ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో గజేందర్‌, నవీన్‌, మహేందర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మరో ఇద్దరు నిఖిల్‌, సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సంబంధించిన ఇతర బ్యాంకు ఖాతాలు, సైబర్‌ నేర ముఠాలపై సంబంధాలు, కమీషన్‌ చెల్లింపులు, తదితరపై విచారణ కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement