వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

Jun 1 2026 7:23 AM | Updated on Jun 1 2026 7:23 AM

నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆదివారం ముగ్గురు మృతిచెందారు. స్తంభం పైనుంచి పడి వలసకార్మికుడు, చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతిచెందారు.

స్తంభం పైనుంచి పడి వలసకార్మికుడు..

ఖానాపూర్‌: మండలంలోని బావాపూర్‌(కే) శివారులో ఆదివారం విద్యుత్‌ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభంపై నుంచి కిందపడి వలస కార్మికుడు మృతిచెందాడు. ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా బావాపూర్‌ (కే) పరిసరాల్లో పలుచోట్ల స్తంభాలు కూలిపోగా, సరఫరా నిలిచిపోయింది. ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన కార్మికులతో మరమ్మతు చేపట్టారు. యవత్మాల్‌ జిల్లా ఉమర్‌ఖేడ్‌ తాలూకా దేవరంగా గ్రామానికి చెందిన పెదేవర్‌ ప్రకాశ్‌ (33) కార్మికుడు, స్తంభం ఎక్కి కొత్త వైరింగ్‌ అమర్చే పనులు చేస్తున్నాడు. వైర్లు కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు జారి స్తంభం పైనుంచి కిందపడిపోయాడు. ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు అతడిని ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి..

లక్ష్మణచాంద: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కాళ్లకు వల చుట్టుకుని మృతి చెందినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన తోకల చిన్న లింగన్న(40) శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పులి చెరువులో చేపల వేటకు వెళ్లాడు. రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికిన ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం చెరువులో వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై.. మృతదేహాన్ని బయటకు తీయించగా కాళ్లకు వల చుట్టుకుని మృతిచెందినట్లు గుర్తించారు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

లక్సెట్టిపేట: మండలంలోని శాంతాపూర్‌ గ్రామ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్‌ కాలనీకి చెందిన గుర్రాల ప్రశాంత్‌(22) బైక్‌పై శనివారం పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లాడు. తిరిగి లక్సెట్టిపేటకు రాత్రి వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న స్కూటీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అంబులెన్సులో మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న రవీందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement