చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి వాసి పాగిరి వనజ జనగణమణ, పలు పాటలకు సంగీతం పాల్గొన్న ఆమెకు గోల్డ్‌మెడల్, సర్టిఫికెట్
చెన్నూర్‌రూరల్: వారిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో కష్టపడి చదివించి వివాహం చేశారు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే సంగీత వాయిద్యకారుల కార్యక్రమంలో పాల్గొని ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డులో సాధించింది. చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాగిరి వనజ. ఈమె తల్లిదండ్రులు పాగిరి లక్ష్మి– లింగయ్యలది నిరుపేద వ్యవసాయ కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలకు వివాహం జరిపించారు. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమార్తె వనజకు 2024లో వివాహం జరిగింది. ఈమె భర్త మహేశ్‌కుమార్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఏడీపీఎంగా పని చేస్తున్నాడు. ఆమె హైదరాబాద్‌లోని ఇన్మార్ ఇంటలిజెన్స్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో పని చేస్తోంది.
భర్త ప్రోత్సాహంతోనే..
ఉద్యోగం చేస్తూనే వనజ భర్త మహేశ్‌కుమార్ ప్రోత్సాహంతో 2026 జనవరిలో ఆన్‌లైన్‌లో కీబోర్డుపై సంగీత వాయిద్యం నేర్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్ జొరాస్ట్రియన్ క్లబ్‌లో గిన్నీస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పాస్టర్ ఆగస్టిన్ దండంగి స్థాపించిన మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో పాల్గొంది. జనగణమణ, పలు పాటలకు సంగీతం వాయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ నుంచి గుర్తింపు లభించింది. సంస్థ ప్రతినిధులు మే 29న ఆమెకు గిన్నీస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌తోపాటు గోల్డ్ మెడల్ అందజేశారు.


