సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సొంతిల్లు నిర్మించుకోవాలని చూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం రెండోసారి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. జిల్లాలో మొదటి దశలో రాని వారికి రెండో విడతలో మంజూరుకు నిర్ణయించింది. వచ్చే నెల 2న రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తోంది. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తమ సొంత జాగాల్లో ఇప్పటికే నిర్మాణం చేపట్టగా, ఇంకా కొన్ని చోట్ల పలు కారణాలతో నిలిచిపోయాయి. ఇళ్లు మంజూరైనప్పటికీ చాలా చోట్ల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణం కాగా, పెరుగుతున్న నిర్మాణ సామగ్రి వ్యయంతోనూ ఇబ్బంది ఏర్పడుతోంది. దీంతో కొన్ని చోట్ల లబ్ధిదారుల ఇళ్లు పునాదుల దశలోనే ఉన్నాయి. చాలామంది ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. కొందరు మంచిరోజులు లేక వేచి చూస్తున్నారు.
రెండో విడతలో 2500చొప్పున
జిల్లాలో మొదటి విడతలో మూడు ప్రధాన నియోజకవర్గాలైన మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లితోపాటు ఖానాపూర్ నియోజకవర్గం పరిధి జన్నారం మండలం, సిర్పూర్ నియోజకవర్గ పరిధి భీమిని, కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాలతో కలిపి మొత్తం 11వేల ఇళ్లకు అనుమతి రాగా.. తర్వాత పలు కారణాలతో 10వేలకు మంజూరు ఇచ్చింది. వీటిలో ఇప్పటికీ 15శాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. చాలామందికి మొదటి, రెండో విడత బిల్లులు మంజూరు వద్దనే నిలిచిపోయాయి. ప్రభుత్వం పునాదుల దశ నుంచి పిల్లర్లు, గోడలు, స్లాబ్, పూర్తయిన వరకు మొత్తం నాలుగు దశల్లో రూ.5లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. కానీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని కాంట్రాక్టు ఇచ్చిన చోట్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయి. కొందరు కొత్తగా తమకు ఇళ్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటామని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రెండో విడతలో 2500 చొప్పున మంజూరు చేస్తే మరో 7500 ఇళ్లు రానున్నాయి. దీంతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఎల్1 స్థాయిలో మండల అధికారుల వద్ద ఉన్నాయి. మొదటి విడతలో రాని వారికి రెండో విడతలో అవకాశం కలుగనుంది. ఇంటి నిర్మాణం విస్తీర్ణం కనిష్టం 400 చదరపు అడుగుల నుంచి 600లోపే నిర్మించుకోవాలనే నిబంధనతోనూ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అంతకంటే ఎక్కువ నిర్మాణాలకు అవకాశం కల్పించాలని ఇప్పటికే చాలామంది వినతులు ఇచ్చారు. దీంతో రెండో విడతలో అవకాశం కల్పిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. రెండో విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్లపై పీడీ బన్సిలాల్ స్పందిస్తూ.. ప్రభుత్వం విధివిధానాల మేరకు జిల్లాలో అర్హులకు మంజూరు చేస్తామని తెలిపారు.
జిల్లాలో మొదటి విడత
మంజూరు 10,305
గ్రౌండింగ్ 8,291
ప్రారంభించనివి 2,014
బేస్మెంట్ స్థాయి 1,994
స్లాబ్ స్థాయి 1,153
స్లాబ్ పూర్తయినవి 2,366
పూర్తయిన ఇళ్లు 1,490


