కుర్చీ వదలరు! | - | Sakshi
Sakshi News home page

కుర్చీ వదలరు!

May 23 2026 11:57 PM | Updated on May 23 2026 11:57 PM

● దీర్ఘకాలికంగా ఒకేచోట అధికారులు, సూపర్‌వైజర్ల విధులు ● సింగరేణి సంస్థ, ఏరియా కార్మికులకు నష్టం!

మందమర్రిరూరల్‌: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియాలోని ఐటీ, సెక్యూరిటీ, ఎస్టేట్స్‌, ఎన్విరాన్‌మెంటు, మేనేజర్‌, అండర్‌ మేనేజర్‌ తదితర హోదాల్లోని అధికారులు దీర్ఘకాలికంగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఏరియాలోని సివిల్‌, క్వాలిటీ, ఎస్టేట్‌, సెక్యూరిటీ విభాగాల్లో, గనుల్లో సూపర్‌వైజర్లు, క్లర్క్స్‌, జీఎం కార్యాలయంలోని పలు విభాగాల్లో అధికారులు, వర్క్‌షాప్‌, సీహెచ్‌పీ తదితర విభాగాల్లోని అధికారులు పైరవీలతో కీలకమైన పోస్టుల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. కీలకమైన పోస్టు(ఫోకల్‌ పాయింట్‌)ల్లో విధులు నిర్వర్తించే వారిని రెండు, మూడేళ్లకు ఒకసారి ఇతర విభాగాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట విధులు నిర్వర్తించడం వల్ల ఇతర ఉద్యోగులను చూపు చూస్తుండడం, కొందరు ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వడం తదితర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు, సూపర్‌వైజర్లపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం రొటేషన్‌ పద్ధతిలో బదిలీలు జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుందని ఉద్యోగులు కోరుతున్నారు.

సంస్థకు నష్టం..!

సింగరేణి సంస్థలో దీర్ఘకాలికంగా, కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వర్తించడం వల్ల సంస్థ, ఏరియా కార్మికులకు నష్టం వాటిల్లుతోందని ఆరోపణలున్నా యి. కొన్ని ఏరియాల్లో అధికారులు కిందిస్థాయి కార్మికుల నుంచి ఈఎంఐలు, నెలవారీ చిట్టీలు కట్టించుకోవడం, ఉచిత మస్టర్లు వేయించి కార్మికులతో ఇంటి పనులు చేయించుకోవడం, మామూళ్ల వసూళ్లు తదితర ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం మూడు, ఐదేళ్ల వరకు ఒకే ఏరియాలో విధులు నిర్వర్తించే అధికారులు, సూపర్‌వైజర్లు, పేషీట్‌ క్లర్క్స్‌, షిఫ్ట్‌ ఓవర్‌మెన్‌లను గతంలో యాజమాన్యం ఒకేచోట కాకుండా షిఫ్టు మార్పు చేసేది. కానీ యాజమాన్యం కొందరి విషయంలో బదిలీ చేయకపోవడంతో ఇతర అధికారులు, సూపర్‌వైజర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా, కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి బదిలీపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని గుర్తింపు సంఘం అధ్యక్షుడు సీతారామయ్యకు ఓ ఏరియాలోని క్లరికల్‌ అసోసియేషన్‌ వారు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement