‘జలం ఇంకుడు’ గుంతలు | - | Sakshi
Sakshi News home page

‘జలం ఇంకుడు’ గుంతలు

May 23 2026 11:57 PM | Updated on May 23 2026 11:57 PM

● భూగర్భ జలాల పెంపు ● గ్రామాల్లో తప్పనున్న మురికినీటి తిప్పలు ● జిల్లాలో వ్యాప్తంగా 53 మంజూరు

చెన్నూర్‌రూరల్‌: ప్రభుత్వం గతంలో ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు అందజేసింది. ఇంకుడు గుంతల నిర్మాణంతో ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీరంతా ఆ గుంతల్లో ఇంకేది. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేవి. గ్రామాల్లో ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరంతా రోడ్లపై పారకుండా ఉండేందుకు, భూగర్భ జలాలు పెంపొందేందుకు ప్రభుత్వం సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతోంది. ఇందుకు గాను ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి రూ.62వేలు మంజూరు చేస్తోంది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 53 ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. చెన్నూర్‌ మండలంలో తొమ్మిది, బెల్లంపల్లిలో ఆరు, జైపూర్‌ 18, కోటపల్లిలో నాలుగు, జన్నారంలో మూడు, లక్సెట్టిపేటలో మూడు, నెన్నెలలో నాలుగు, భీమినిలో మూడు, తాండూరులో మూడు చొప్పున ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీల ఉపాధిహామీ ఖాతాలో డబ్బులు కూడా జమ చేశారు.

కొనసాగుతున్న పనులు

చెన్నూర్‌తోపాటు జైపూర్‌, బెల్లంపల్లి మండలాల్లో ఇంకుడుగుంతల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చెన్నూర్‌ మండలం సంకారం గ్రామంలో నిర్మాణం తుది దశకు చేరింది. మిగతా ఆరు మండలాల్లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇంకుడుగుంతల నిర్మాణంతో గ్రామాల్లో మురుగు నీరు, దోమల బెడద తప్పుతుంది. రోడ్లపై మురికి నీరు పారదు. భూగర్భ జలాలు పెరిగి ప్రజలు, రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement