పాతమంచిర్యాల: ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని ఈ నెల 18 నుంచి గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్‌లో పని చేస్తున్న వీవోఏ(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)లు సమ్మె బాట పట్టారు. చాలీచాలని జీతాలతో 23ఏళ్లు పని చేస్తున్నా ప్రభుత్వం తమ సేవలకు తగిన ఫలితం అందించడం లేదని, రూ.8వేల జీతంతో జీవితాలు వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. దీర్ఘకాలికంగా సమస్యలతో సతమతం అవుతున్నామని, పరిష్కరించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్, సెర్ప్ సీఈవోకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నారు. వీవోఏలు స్వయం సహాయక గ్రామైక్య సంఘాల్లోని మహిళా సభ్యులకు పొదుపుపై అవగాహన కల్పించడం, రుణాలు ఇప్పించి, వసూలు చేయడం, రికార్డులు రాయడం, గ్రామ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5వేలు గౌరవ వేతనం, గ్రామ సంఘాల నుంచి రూ.3వేలు మొత్తంగా రూ.8వేలతో పని చేస్తున్నారు. జిల్లాలో 2003 నుంచి వీవోలుగా పని చేస్తున్నారు. అర్హులైన వారికి కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా పదోన్నతి కల్పించాలని, కనీస వేతనం రూ.20వేలు ఇవ్వాలని, ప్రమాద బీమా రూ.20లక్షలు చెల్లించాలని వేడుకుంటున్నారు. డిమాండ్ల సాధన కోసం మండల సమాఖ్య, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట సమ్మె చేస్తున్నారు. విధులు నిర్వర్తిస్తూనే సమస్యలపై పోరాటం చేయాలని, సమ్మె విరమించి విధుల్లో చేరాలని అధికారులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మెలోనే కొనసాగుతామని వీవోఏలు స్పష్టం చేస్తున్నారు. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తమ సమస్యల పరిష్కారంపై స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.


