కూల్చివేతలను అడ్డుకున్న వ్యాపారులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి బజార్ ఏరియా ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులను వ్యాపారులు సోమవారం అడ్డుకున్నారు. పాతబస్టాండ్ చౌరస్తా వద్ద నుంచి సరస్వతీ శిశుమందిర్ మీదుగా అంబేడ్కర్‌నగర్ చౌరస్తా వరకు చేపట్టనున్న విస్తరణ పనుల్లో భాగంగా మున్సిపల్ అధికారులు జేసీబీతో కట్టడాల కూల్చివేతకు యత్నించారు. వ్యాపారులు, ప్రజలు జేసీబీకి అడ్డంగా నిలబడి అడ్డుకున్నారు. ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ రమేష్, టీపీఓ చంద్రశేఖర్‌లతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పును కుదించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. వ్యాపారులు, కాంట్రాక్టర్ బస్తీ, బజారు ఏరియాకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
నేడు దుకాణాల బంద్‌కు పిలుపు
రోడ్డు వెడల్పు పేరుతో శాశ్వత కట్టడాల కూల్చివేతకు నిరసనగా మంగళవారం బజారు ఏరియాలో దుకాణాల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేసి బంద్‌ను విజయవంతం చేయాలని, పురప్రజలు సహకరించాలని వ్యాపారులు కోరారు.


