ఎస్సై పోస్టులు ఖాళీ!
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదివరకు ఇక్కడ పనిచేసిన ముగ్గురు ఎస్సైలు ఆరునెలల క్రితం బది లీపై వెళ్లారు. అప్పటి నుంచి వారి స్థానంలో ఎవరినీ భర్తీ చేయకపోవడం సర్వత్రా విమర్శలకు తావి స్తోంది. దశాబ్దాల కాలం నుంచి డివిజన్ కేంద్రం మొదలుకుని తూర్పుజిల్లాగా చివరికి జిల్లా కేంద్రంగా, ప్రస్తుతం కార్పొరేషన్ స్ధాయికి ఎదిగింది. వ్యా పార, రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగాల్లో దినదినం అభివృద్ధి చెందుతోంది. దీంతోపాటు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్యతో పాటు నేరా లు, ఘోరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏడాదికి సుమారు 800 వరకు కేసులు నమోదవుతాయి. రోజుకు 30 నుంచి 40 వరకు ఫిర్యాదులు, వందల మంది వివిద సమస్యలతో స్టేషన్‌కు వస్తారు. స్థిరా స్తి గొడవలు, భూ సమస్యలు ఎక్కువే. వీరికి సమాధానం చెప్పేందుకు ఏఎస్సైలే దిక్కవుతున్నారు.
కుర్చీలు ఖాళీ..
జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నలుగురు ఎస్సైలు, ఒక సీఐ విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ సీఐ, ఇద్దరు ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, 15 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 45 మంది కానిస్టేబుళ్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో నుంచి కోర్టు డ్యూటీ, గన్‌మెన్లు, బ్లూకోల్ట్, రైటర్లు, ఫిర్యాదుల స్వీకరణకు సుమారు 20 మంది పరిమితం అవుతారు. మిగిలిన 25 మంది కానిస్టేబుళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో స్టేషన్‌లోని మిగతా ఎస్సైల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మంచిర్యాల పోలీస్‌స్టేషన్ పరిధి, జిల్లా కేంద్రంలో సుమారు 1.50 లక్షలకు పైగా జనాభా ఉంటుంది. ఇందులో నాలుగు బీట్లుగా విభజించారు. ఏసీసీ వైపు, హమాలీవాడ వైపు, కాలేజ్‌రోడ్ వైపు, మార్కె ట్ ఏరియా.. ఇలా నాలుగు బీట్లలో నలుగురు ఎస్సైలు విధులు నిర్వహించేవారు. ముగ్గురు ఎస్సైలు బదిలీకావడంతో పర్యవేక్షణ కష్టతరమవుతోందని కొందరు పోలీస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోరోజు ఫిర్యాదుల పరిశీలన, ఎఫ్‌ఐఆర్ నమోదు, బాధితులతో మాట్లాడే వరకు రాత్రి 11 గంటల వరకు అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలి లేదా సిబ్బంది సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొందరు పోలీస్ అధికారులే చర్చించుకోవడం గమనార్హం.


