మళ్లీ పులుల అలజడి
మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లలో సంచారం
అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాలు
రెండు పులులు సంచరిస్తున్నట్లు సమాచారం
చెన్నూర్: మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లలో మళ్లీ పులులు సంచరిస్తుండడంతో అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రెండు డివిజన్లలో పాదముద్రల ఆధారంగా రెండు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా ఎన్ని పులులు సంచరిస్తున్నాయి? అవి ఏప్రాంతం నుంచి వచ్చాయనే విషయాలు కనుగొనేందుకు రెండు ఫారెస్ట్ డివిజన్ల అధికారులు, అనిమల్ ట్రాకర్స్, ప్రత్యేక బృందాలు అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నట్లు సమాచారం.
కోడైపె దాడి..
ఈ నెల 3న భీమారం మండలంలోని దాంపూర్‌లో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు కనుగొన్నారు. ఈ నెల 4న నీల్వాయి రేంజ్ పరిధిలోని వేమనపల్లి మండలం చామనపల్లిలో కాపరి జంపం పవన్ పశువుల మందను ఇంటికి తోలుకొస్తుండగా పెద్దవాగు సమీపంలో మాటువేసి ఉన్న పులి మందపై దాడి చేసింది. భయాందోళన చెందిన కాపరి చేతిలో ఉన్న గొడ్డలి, టిఫిన్‌బాక్స్ పక్కన పడేసి వెంటనే పక్కనే ఉన్న మద్దిచెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాపరి చూస్తుండగానే దుర్గం బానయ్యకు చెందిన కోడైపె పులి దాడి చేయడంతో తప్పించుకుని ఇంటికి పరుగులు తీసింది. కాపరి ఇంటికి ఫోన్‌చేసి విషయం చెప్పడంతో గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో శబ్ధం చేసుకుంటూ రావడంతో పులి పారిపోయింది. విషయం తెలుసుకున్న బద్దంపల్లి, చామన్‌పల్లి అటవీ సెక్షన్ బీట్ అధికారులు స్వామి, స్వరూప, హేమంత్, రాజ్‌కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంఘటన స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బమ్మెన అటవీప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలుస్తోంది. శీతాకాలం కావడంతో అటవీప్రాంతంలో పులులకు ఆహారంతో పాటు నీరుసైతం సమృద్ధిగా లభిస్తుంది. దీంతో చెన్నూర్, మంచిర్యాల డివిజన్ల పరిధిలో గల శివ్వారం, కుందారం, కొత్తపల్లి, చెన్నూర్ మండలంలోని బుద్దారం, సంకారం, కన్నెపల్లి, అస్నాద్, నీల్వాయి రేంజ్‌లోని మైలారం, బద్దెంపల్లి, చామనపల్లి, నక్కలపల్లి ప్రాంత అటవీ ప్రాంతాలలో పులులు సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గతంలో చెన్నూర్ డివిజన్‌లో..
గతంలో చెన్నూర్ డివిజన్ పరిధిలోని చెన్నూర్, నీల్వాయి రేంజ్‌లో కే–4, కే–2, జే–1 పులులు సంచరించి అలజడి సృష్టించాయి. పశువులపై దాడులు చేస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. కే–4 పులి ఉచ్చుతో ఉండగా మరో రెండు పులులు ఆడపులులకోసం గాలింపు చేపట్టాయి. ఆరు నెలల పాటు ఈ ప్రాంతంలో సంచరించిన ఆ మూడు పులుల జాడ లేకుండా పోయింది. ఒక పులి మహదేవ్‌పూర్ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలకు సైతం చిక్కలేదు. మరో రెండు పులులు తడోబాకు వెళ్లినట్లు అధికారులు ప్రకటించారు. రెండేళ్ల తర్వత మళ్లీ చెన్నూర్, మంచిర్యాల డివిజన్లలో పులుల అలజడి మొదలైంది.


