హోరాహోరీ పోరు
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో రెండో విడత జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. సెగ్మెంట్ వ్యాప్తంగా 114 జీపీల్లో 336 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాసిపేట మండలం ధర్మారావుపేట, కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రా మ పంచాయతీల్లో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్టీ ఓటర్లు ఉన్న వేమనపల్లి మండలం రాజారాం జీపీని ఎస్సీలకు రిజర్వు చేయడంతో సర్పంచ్ అభ్యర్థులు లేక నామినేషన్‌లు దాఖలు చేయలేదు. ఆరు వార్డులకు మూడింటిని జనరల్‌కు రిజర్వు చేయడంతో వాటికి ఎన్నికలు జరగనున్నా యి. ఎస్సీలకు కేటాయించిన మిగిలిన మూడు వార్డుల్లో పోలింగ్ జరిగే ఆస్కారం లేకుండా ఉంది. ఒక్కో గ్రామ పంచాయతీలో నువ్వా? నేనా? అనే రీతిలో పోటీపడే పరిస్థితులు కనిపిస్తుండగా ప్రధాన రాజకీయ పక్షాల మద్దతుదారులతో పాటు, మహిళలు, ఔత్సాహికులు, యువ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల పోరులో తలపడుతున్నారు. శనివారంతో నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా అభ్యర్థులు ప్రచార పర్వానికి తెర తీశారు. వాట్సాప్ గ్రూపుల్లో ఎన్నికల గుర్తులను పోటాపోటీగా పోస్టు చేసి ఓటర్ల దృష్టిలో పడేలా చేస్తున్నారు.
రసవత్తరంగా పోటీ
సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. శక్తి యుక్తులను కూడగట్టి ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా గెలుపే లక్ష్యంగా పోటీ పడుతుండటంతో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చాలామట్టుకు నామినేషన్ దాఖలు నుంచే ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఎన్నికలను రక్తి కట్టించారు. ఈనెల 14న పోలింగ్ జరిగే రోజు వరకు అదే తీరుగా వ్యవహరించేలా పథక రచన చేసుకున్నారు. బెల్లంపల్లి మండలంలో తాళ్లగురిజాల, మాలగురిజాల, బుధాకుర్థు, చంద్రవెళ్లి, పాత బెల్లంపల్లి, దుగినేపల్లి, బట్వాన్‌పల్లి, అంకుశం, తదితర పంచాయతీల్లో, తాండూర్ మండలంలోని కిష్టంపేట, రేచినీ, కాసిపేట, ద్వా రక, తాండూర్, మాదారం, నెన్నెల మండలంలో మైలారం, జెండా వెంకటాపూర్, ఆవుడం, జోగాపూర్, నెన్నెల, గొల్లపల్లి పంచాయతీల్లో, కన్నెపల్లి మండలం జన్కాపూర్, జజ్జర వెళ్లి, టేకులపల్లి, కన్నెపల్లి, కాసిపేట మండలంలో కోమటిచెన్, దేవాపూర్, ముత్యంపల్లి పంచాయతీలతో పాటు భీమిని, వేమనపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
ఎన్నికల ప్రచారానికి మద్యం కిక్కు
అనుచరులతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సాగి స్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఓటు వే యాలని అభ్యర్థిస్తున్నారు. ఈసారి తప్పకుండా తన నే సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతున్నారు. మహిళా అభ్యర్థుల పక్షాన భర్తలు ముందుండి ప్రచారం చేస్తున్నారు. అనుచరులతో పాటు ఓటర్లకు మందు పార్టీలు ఏర్పాటు చేసి ప్రలోభాలకు గురిచేస్తున్నా రు. ఆయా మండలాల్లోని మద్యం షాపుల్లో మాట్లాడుకుని మద్యం సరఫరా జరిగేలా ముందస్తు ఒ ప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి మండలాల్లో ఎన్నికల ప్రచా రానికి అభ్యర్థులు మద్యంతో కిక్కు ఇస్తున్నారు.
హోరాహోరీ పోరు


