విద్యార్థులకు కొత్త ప్రోగ్రెస్ కార్డులు
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే సాధారణ ప్రోగ్రెస్ కార్డుల విధానం ఇక స్వస్తి పలకనుంది. జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని కొలిచే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ప్రవేశపెట్టనుంది. ఈ కార్డులు వారి 360 డిగ్రీల అభివృద్ధిని అంచనా వేస్తోంది. విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత, మానసిక, శారీరక అంశాలు, పాఠశాలలో చేపట్టే పలు పోటీల్లో వారి సామర్థ్యం, ప్రతిభ వంటి తదితర వివరాలు కార్డుల్లో పొందుపర్చనున్నారు. ఈ విధానం ద్వారా ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని విద్యార్థులకు మేలు చేకూరనుంది.
బడుల బలోపేతానికి చర్యలు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఇటీవల బడుల నిర్వహణ, స్పోర్ట్స్ నిధులు విడుదల చేసింది. దీనికి తోడు మధ్యాహ్న భోజనం చార్జీలు పెంచింది. విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం ప్రతిభ, వారి సామర్థ్యం సంబంధించిన సమాచారం ఇక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వనుంది.


